ఆపరేషన్లు చేయకపోతే రోగుల పరిస్థితి ఏంటి? | What will happen to patients if operations? | Sakshi
Sakshi News home page

ఆపరేషన్లు చేయకపోతే రోగుల పరిస్థితి ఏంటి?

Jan 12 2014 2:39 AM | Updated on Jun 1 2018 8:47 PM

మూడేళ్లుగా ఆర్థో ఆపరేషన్ థియేటర్‌ను వినియోగించడం లేదా..? ఇలాగైతే రోగుల పరిస్థితి ఏమిటని ఆర్థో హెచ్‌ఓడీ డాక్టర్ జేసీ రెడ్డిని ఎంసీఐ బృందం సభ్యుడు ఫ్రొఫెసర్ డాక్టర్ యతిన్‌దేశాయ్(అహ్మదాబాద్) ప్రశ్నించారు.

అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్:  మూడేళ్లుగా ఆర్థో ఆపరేషన్ థియేటర్‌ను వినియోగించడం లేదా..?  ఇలాగైతే రోగుల పరిస్థితి ఏమిటని ఆర్థో హెచ్‌ఓడీ డాక్టర్ జేసీ రెడ్డిని ఎంసీఐ బృందం సభ్యుడు ఫ్రొఫెసర్ డాక్టర్ యతిన్‌దేశాయ్(అహ్మదాబాద్) ప్రశ్నించారు. 18 పీజీ సీట్లకు సంబంధించి శనివారం ఎంసీఐ బృందం రెండోరోజు అనాటమీ, ఫోరెన్సిక్ విభాగాలను తనిఖీ చేసింది. ఈ బృందంలోని ఫ్రొఫెసర్ ఆఫ్ అనాటమీ డాక్టర్ టీకే దాస్(అస్సాం),  ఫ్రొఫెసర్ ఆఫ్ ఫోరెన్సిక్ డాక్టర్ కనక్‌దాస్(అస్సాం) ఆయా విభాగాల డాక్టర్ల వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు.
 
 రూ లక్షలు పోసి ఆర్థో ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసినా ఎందుకు వినియోగించలేదని ఆర్థో హెచ్‌ఓడీ, ఆస్పత్రి యాజమాన్యాన్ని వారు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ప్రతి రోజూ ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్సలు చేయాలన్నారు. నిబంధనలను అమలుచేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు సమాధానమిస్తూ థియేటర్ రిపేరీలో ఉందన్నారు. మరమ్మతులకు సంబంధించి బడ్జెట్ కూడా విడుదలైందని చెప్పడంతో డాక్టర్ యతిన్ దేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
 అనంతరం వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ విభాగాన్ని పరిశీలించారు. పరిశోధనలు చేస్తున్నారాల లేదా అని డాక్టర్ కనక్‌దాస్ ఆరా తీశారు. ఆస్పత్రిలోని మార్చురీను తనిఖీ చేశారు. 2010 నుంచి ఎన్ని ఎంఎల్‌సీ కేసులను చేశారని విచారించారు.
 
 ప్రతి ఏటా 600కు పైగా కేసులు చేస్తున్నామని  ఫోరెన్సిక్ విభాగంవారు తెలిపారు. అనంతరం బ్లడ్‌బ్యాంకును పరిశీలించారు. ఏఎంసీకి వెళ్లి  ఎన్ని మంచాలున్నాయని డ్యూటీ ఇన్‌చార్జ్ డాక్టర్ భీమసేనాచార్‌ను ప్రశ్నించారు.  పాయిజన్ కేసులను పరిశీలించి, వెంటిలేటర్  బాగా పనిచేస్తోందా అని అడిగి తెలుసుకున్నారు.  వైద్య కళాశాలలోని అనాటమీ విభాగాన్ని నిశితంగా పరిశీలించారు. అనాటమీ విభాగానికి సంబంధించి రికార్డులు పక్కాగా ఉండాలని డాక్టర్ టీకేదాస్ సూచించారు.  అనంతరం ఆయా విభాగాల వివరాలను ఎంసీఐ బృందం సేకరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement