ఉపాధ్యాయులు ‘ఓటె’త్తారు. శాసనమండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఆదివారం
ఉపాధ్యాయులు ‘ఓటె’త్తారు. శాసనమండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఆదివారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కాకినాడ సిటీ :శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలోని రెండు జిల్లాల్లో మొత్తం 83.71 శాతం పోలింగ్ నమోదవగా ‘తూర్పు’న 82.71 శాతం, ‘పశ్చిమ’లో 85 శాతం నమోదైంది. మొత్తం రెండు జిల్లాల్లోని 117 పోలింగ్ కేంద్రాల పరిధిలో 21,551 మంది ఓటర్లు ఉండగా 18,040 ఓట్లు పోలయ్యాయి. ‘తూర్పు’లో 12,176 మంది ఓటర్లకు 10,071 మంది, ‘పశ్చిమ’లో 9,375 మందికి 7,969 మంది ఓటు వేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 8 గంటల నుంచే పలుచోట్ల ఓటర్లు బారులు తీరారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో చాలామంది ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
ప్రారంభం నుంచీ పోలింగ్ శాతం పెరుగుతూనే వచ్చింది. కాకినాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఉదయమే బారులు తీరారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ రెండో కంపార్టుమెంట్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. దీంతో మధ్యాహ్ననికి రద్దీ తగ్గింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్‌ను నిర్వహించారు. వెబ్‌కాస్టింగ్‌ను కలెక్టరేట్ కోర్టు హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్నికల విభాగంతో అనుసంధానించి ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించారు.
మరోపక్క కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎన్నికల పరిశీల కులు ఎం.జగన్నాథం కలెక్టరేట్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షి స్తూ సిబ్బందికి సూచనలు జారీ చేశారు. వారిద్దరూ కాకినాడ నగరంలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ తీరును పరిశీలించారు. మరోపక్క పోటీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజు, మరో అభ్యర్థి పరుచూరి కృష్ణారావులు జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కాకినాడ డివిజన్‌లో 3,364 ఓట్లకు 2,822, పోలయ్యాయి. పెద్దాపురం డివిజన్‌లో 1,044 ఓట్లకు 978, రాజమండ్రి డివిజన్‌లో 2,839 ఓట్లకు 2,029, రామచంద్రపురం డివిజన్‌లో 1,214 ఓట్లకు 1,082, అమలాపురం డివిజన్‌లో 2,962 ఓట్లకు 2,590, రంపచోడవరం డివిజన్‌లో 753 ఓట్లకు 570 పోలయ్యాయి.
పిఠాపురంలో మద్యంషాపు సీజ్
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 20 సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకూ జిల్లాలో మద్యం షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పిఠాపురం పట్టణంలోని దుర్గా వైన్‌షాపులో దీనిని ఉల్లంఘించి మద్యం అమ్మకాలు నిర్వహించారు. దీనిపై మీడియాలో స్క్రోలింగ్‌లు చూసిన కలెక్టర్ స్పందించి తక్షణం షాపు యజమానిపై చర్యలు తీసుకుని, లెసైన్సు రద్దు చేయాలని ఆదేశించారు. దీంతో మద్యం షాపును సీజ్ చేసి, షాపు యజమాని దామోదర్‌రావుతోపాటు బోయ్ శ్రీనివాసరావును అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అలాగే రాజమండ్రి నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఆర్‌కేఆర్ వైన్స్‌షాపు సిబ్బంది పక్కనుంచి మద్యం అమ్మకాలు చేస్తుండడాన్ని అధికారులు గుర్తించారు. దానిపై దాడి చేసి రూ.3.10 లక్షల విలువ చేసే 120 మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలింగ్ సరళి సాగిందిలా...
సమయం పోలైన ఓట్లు శాతం
ఉదయం 10 గంటలకు 4,766 22.11
మధ్యాహ్నం 12 గంటలకు 11,205 51.99
మధ్యాహ్నం 2 గంటకు 14,900 69.14
సాయంత్రం 4 గంటలకు 18,040 83.71