
ఇదిగదిగో అవినీతి!
అన్నవరం దేవస్థానంలో సత్రం గదులు, వివాహ వేదికల రిజర్వేషన్ కేటాయింపు విషయంలో భారీ అవినీతి చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివాహ ముహూర్తాల సమయంలో
అన్నవరం :అన్నవరం దేవస్థానంలో సత్రం గదులు, వివాహ వేదికల రిజర్వేషన్ కేటాయింపు విషయంలో భారీ అవినీతి చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివాహ ముహూర్తాల సమయంలో గదులు దొరుకుతాయో లేదోనన్న పెళ్లి బృందాల ఆత్రుతను సాకుగా తీసుకుని కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఆర్‌ఓ కార్యాలయంలో కొంతమంది అధికారులు, సిబ్బందితో బ్రోకర్లు, పెళ్లిగుమ్మటాల నిర్వాహకులు చేతులు కలిపి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని భక్తులు వాపోతున్నారు.
గదుల రిజర్వేషన్‌కు ఇవీ నిబంధనలు...
దేవస్థానంలోని వివిధ సత్రాలలో మొత్తం 500 గదులున్నాయి. సత్యగిరిపై విష్ణుసదన్‌లో 36 వివాహ హాళ్లు, మరో 14 చోట్ల వేదికలు ఉన్నాయి. వివాహాలు చేసుకునే వారు నెల రోజుల ముందుగా గదులు రిజర్వ్ చేసుకోవాలి. మొత్తం దేవస్థానం గదుల్లో 30 శాతం వరకూ ముందుగా రిజర్వ్ చేస్తారు. మిగతా గదులు అప్పటికప్పుడు కేటాయిస్తారు. ఇక వివాహ వేదికలు, హాళ్ల విషయాని కొస్తే పెళ్లి బృందాలు వాటిని మూడు నెలల ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు.
అవినీతి జరుగుతోందిలా...
వివాహ వేదికలు, గదుల రిజర్వేషన్లలో వేర్వేరు నియమాలు అమలులో ఉండడంతో ఈ అక్రమార్జన జోరుగా సాగుతోంది. ఆగస్టు నెలలో (శ్రావణమాసం) 13, 14, 15 తేదీలలో వివాహాలు భారీగా ఉండడంతో అక్రమార్కులు గదులు, వేదికలపై కన్నేశారు. వివాహ వేదికలను మూడు నెలలు ముందుగా రిజర్వేషన్ చేసి, వాటితో పాటు గదులు కూడా ఇచ్చేలా వివాహ బృందాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అధిక శాతం బినామీ పేర్లపై రిజర్‌వ చేసుకుని హాళ్లు, వివాహ వేదికలకు రెండేసి గదులు ఇవ్వాలని, వంద గదులు వీటికి కేటాయించేశారు. దీంతో నెల రోజుల ముందు గదులకు రిజర్వేషన్ చేయాలన్న నిబంధనను అటకెక్కింది.
మధ్యవర్తులను ఆశ్రయించాల్సిందే
పెళ్లిళ్ల సమయంలో గదులు, హాళ్లు, వేదికలు కావాల్సిన వారు బ్రోకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులను కల్పిస్తున్నారు. మరోవైపు గదుల కోసం వస్తే వారికి ఖాళీ లేవనే సమాధానం ఆలయ సిబ్బంది, అధికారుల నుంచి రావడంతో చాలా మంది మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ విధంగా రూ. వేలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితితో సత్యదేవుని సన్నిధిలో వివాహాలు చేసుకునే చిన్న మధ్యతరగతి భక్తులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.
పరిశీలించి, చర్యలు తీసుకుంటాం : ఈఓ
నిబంధనలకు విరుద్ధంగా సీఆర్‌ఓ ఆఫీసులో జరుగుతున్న రిజర్వేషన్ల వ్యవహారంపై మంగళవారం సాయంత్రం ‘సాక్షి’ ఈఓ పీ వెంకటేశ్వర్లను వివరణ కోరింది. ఇదే విషయమై తనకు కొంత మంది ఫిర్యాదుచేయడంతో కార్యాలయానికి వెళ్లి తనిఖీ చేశానని, ఆ సమయంలో 30 వివాహవేదికలు, హాళ్లు మూడు నెలల ముందుగానే రిజర్వేషన్ చేసినట్టు గుర్తించామన్నారు. విషయాన్ని పూర్తిగా పరిశీలించి, ఎక్కడైనా అవినీతి జరిగినట్టే రుజువైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.