breaking news
Wedding venues
-
మార్వ్‌లెస్. మాన్సూన్ వెడ్డింగ్స్..
‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే.. చెట్టాపట్టగ చేతులు కలిపి చెట్టు నీడకై పరుగిడుతుంటే.. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..’ అంటూ సాగే పాత తెలుగు సినిమా పాటను గుర్తు చేసేలా నేటి వెడ్డింగ్ ప్లానర్లు ప్లాన్ చేస్తున్నారు.. సాధారణంగా వర్షాకాలంలో పెళ్లిళ్లు అంటే కాస్త ఇబ్బంది.. చిరాకే.. కానీ, పక్కాగా ప్లాన్ చేస్తే వానాకాలంలో పెళ్లి వేడుకలను మధురమైన అనుభూతిగా మిగుల్చుకోవచ్చు.పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైంది. మరోవైపు వేసవి ముగియకముందే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అంగరంగ వైభవంగా అలంకరించుకొని, బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో అకస్మాత్తుగా వర్షం పడితే ముందస్తు ప్లానింగ్ అంతా వేస్ట్ అవుతుంది. పెళ్లికి వచ్చిన వారు చిరాకు పడటంతో పాటు రావాల్సిన బంధువులు రాలేని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే వానాకాలంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం కాసింత కష్టమే. కానీ, ఇవన్నీ పాత రోజులు. నిజం చెప్పాలంటే వర్షాకాలంలో పెళ్లి వధూవరులకు మంచి అనుభూతిని మిగులుస్తుందని అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్లు.హైబ్రిడ్ వేదికలు.. ఈమధ్య కాలంలో వర్షాకాలంలో వివాహాలు ట్రెండీగా మారాయి. పెళ్లి శుభలేఖల నుంచి మొదలుపెడితే వేదిక, మండపం అలంకరణ, అతిథుల ఆహ్వానం, ఫొటోగ్రఫీ, బరాత్ వరకూ అన్నీ ప్రత్యేకమైనవిగా ఉంటాయి. సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే వధూవరులకు, అతిథులకు గొప్ప అనుభూతి కలిగేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాటిక్ పెళ్లి వేడుకలను వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. వాన ఇబ్బందుల నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.అన్ని రకాలుగా వేడుకలకు సిద్ధం చేయడమే ఈ సంస్థల ప్రత్యేకత. పెళ్లి మండపమే కాదు టెర్రస్, లాన్, ఓపెన్ ఏరియా అన్నింటినీ గ్లాస్ కనోపీలతో కవర్ చేస్తారు. జర్మన్ హ్యాంగర్ టెంట్లు, వాటర్ ప్రూఫ్ డోమ్‌లు, ముడుచుకునే పైకప్పులతో వివాహ వేదిక, మండపాలు నిర్మిస్తారు. అకస్మాత్తుగా వర్షం కురిస్తే వాననీరు వెళ్లేందుకు సరైన మార్గాలను ఏర్పాటు చేస్తారు. ట్రాన్స్పరెంట్ పెళ్లి వేదిక, మండపాలతో వధూవరులకే కాదు అతిథులు కూడా వర్షం పడినా తడిసిపోకుండా వర్షపు జల్లులు, శబ్దాలను ఆస్వాదిస్తూ గొప్ప అనుభూతిని పొందుతారు.భద్రత కీలకమే.. నాన్‌స్లిప్ టైల్స్, మ్యాట్లు, తగినంత లైటింగ్‌తో పాటు వృద్ధులకు డ్రై జోన్లను ఏర్పాటు చేస్తారు. వర్షాకాలంలో బరాత్‌లకు బదులుగా సన్నాయి మేళం, డోల్ చప్పుళ్లు, మ్యూజిక్ బ్లాస్టింగ్స్ ఏర్పాటు చేస్తారు. దీంతో అతిథులు గొడుగుల కింద నృత్యం చేసే వీలుంటుంది. విద్యుత్ అంతరాయం కలగకుండా బ్యాకప్ బ్యాటరీలు, జనరేటర్లను క్యారీ చేస్తారు. డీహ్యుమిడిఫయ్యర్లు, ప్లాస్టిక్ టార్ప్లిన్ ఏర్పాటు చేస్తారు. లాంతర్లు, షాండీలియర్ల వెలుగులో వధూవరులు గొడుగుల కింద లేదా వర్షంలో తడుస్తూనే రొమాంటిక్ ఫొటోలకు ఫోజులు ఇస్తారు.వర్షాన్ని ఆస్వాదించేలా.. శుభలేఖ కూడా మేఘాలు, వర్షం చినుకులను ప్రతిబింబించేలా ముద్రిస్తారు. అతిథులు పెళ్లి వేదికలో అక్కడక్కడ శుభ్రమైన చిన్న టవల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. బగ్ స్ప్రే ప్యాచ్‌లు, త్వరగా ఆరిపోయే న్యాప్కిన్లు, వర్షంలో, బురదలో జారిపడిపోకుండా ఫ్లిప్‌ఫ్లాప్ పాదరక్షలు అందుబాటులో ఉంచుతారు. అతిథులు వర్షం మూడ్ ఆస్వాదించేందుకు వేడి టీ, కాఫీలు, మసాలా మాక్టెయిల్స్, ముల్లడ్ వైన్ కాక్టెయిల్స్తో బార్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.వెల్వెట్, సిల్క్ వంటి బరువైన దుస్తులుహుందాగా కనిపిస్తాయి. అయితే వీటి వల్ల వర్షాకంలో ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ వర్షంలో తడిస్తే అవి మరింత బరువుగా మారతాయి. పైగా వర్షం పడిన సమయంలో ఉక్కపోతకు ఇబ్బంది కలిగిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని వీటికి బదులు తేలికపాటి నేత వ్రస్తాలు, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, మృధువైన నైలాన్‌తో తయారైన వ్రస్తాలు, సిల్‌్క, సింథటిక్ ఫైబర్‌తో తయారైన జార్టెట్తో లెహంగాలను డిజైన్ చేస్తున్నారు. ఇవి నీటిని పీల్చుకోకపోవడంతో పాటు తేలికగా ఉండటమే వీటి ప్రత్యేకత. వాటర్ ప్రూఫ్ లైనింగ్, క్విక్ డ్రై దుపట్టాలను వధూవరులు ఎంచుకుంటున్నారు. -
ఇదిగదిగో అవినీతి!
అన్నవరం :అన్నవరం దేవస్థానంలో సత్రం గదులు, వివాహ వేదికల రిజర్వేషన్ కేటాయింపు విషయంలో భారీ అవినీతి చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివాహ ముహూర్తాల సమయంలో గదులు దొరుకుతాయో లేదోనన్న పెళ్లి బృందాల ఆత్రుతను సాకుగా తీసుకుని కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఆర్ఓ కార్యాలయంలో కొంతమంది అధికారులు, సిబ్బందితో బ్రోకర్లు, పెళ్లిగుమ్మటాల నిర్వాహకులు చేతులు కలిపి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. గదుల రిజర్వేషన్‌కు ఇవీ నిబంధనలు... దేవస్థానంలోని వివిధ సత్రాలలో మొత్తం 500 గదులున్నాయి. సత్యగిరిపై విష్ణుసదన్‌లో 36 వివాహ హాళ్లు, మరో 14 చోట్ల వేదికలు ఉన్నాయి. వివాహాలు చేసుకునే వారు నెల రోజుల ముందుగా గదులు రిజర్వ్ చేసుకోవాలి. మొత్తం దేవస్థానం గదుల్లో 30 శాతం వరకూ ముందుగా రిజర్వ్ చేస్తారు. మిగతా గదులు అప్పటికప్పుడు కేటాయిస్తారు. ఇక వివాహ వేదికలు, హాళ్ల విషయాని కొస్తే పెళ్లి బృందాలు వాటిని మూడు నెలల ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. అవినీతి జరుగుతోందిలా... వివాహ వేదికలు, గదుల రిజర్వేషన్లలో వేర్వేరు నియమాలు అమలులో ఉండడంతో ఈ అక్రమార్జన జోరుగా సాగుతోంది. ఆగస్టు నెలలో (శ్రావణమాసం) 13, 14, 15 తేదీలలో వివాహాలు భారీగా ఉండడంతో అక్రమార్కులు గదులు, వేదికలపై కన్నేశారు. వివాహ వేదికలను మూడు నెలలు ముందుగా రిజర్వేషన్ చేసి, వాటితో పాటు గదులు కూడా ఇచ్చేలా వివాహ బృందాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అధిక శాతం బినామీ పేర్లపై రిజర్వ చేసుకుని హాళ్లు, వివాహ వేదికలకు రెండేసి గదులు ఇవ్వాలని, వంద గదులు వీటికి కేటాయించేశారు. దీంతో నెల రోజుల ముందు గదులకు రిజర్వేషన్ చేయాలన్న నిబంధనను అటకెక్కింది. మధ్యవర్తులను ఆశ్రయించాల్సిందే పెళ్లిళ్ల సమయంలో గదులు, హాళ్లు, వేదికలు కావాల్సిన వారు బ్రోకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులను కల్పిస్తున్నారు. మరోవైపు గదుల కోసం వస్తే వారికి ఖాళీ లేవనే సమాధానం ఆలయ సిబ్బంది, అధికారుల నుంచి రావడంతో చాలా మంది మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ విధంగా రూ. వేలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితితో సత్యదేవుని సన్నిధిలో వివాహాలు చేసుకునే చిన్న మధ్యతరగతి భక్తులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటాం : ఈఓ నిబంధనలకు విరుద్ధంగా సీఆర్ఓ ఆఫీసులో జరుగుతున్న రిజర్వేషన్ల వ్యవహారంపై మంగళవారం సాయంత్రం ‘సాక్షి’ ఈఓ పీ వెంకటేశ్వర్లను వివరణ కోరింది. ఇదే విషయమై తనకు కొంత మంది ఫిర్యాదుచేయడంతో కార్యాలయానికి వెళ్లి తనిఖీ చేశానని, ఆ సమయంలో 30 వివాహవేదికలు, హాళ్లు మూడు నెలల ముందుగానే రిజర్వేషన్ చేసినట్టు గుర్తించామన్నారు. విషయాన్ని పూర్తిగా పరిశీలించి, ఎక్కడైనా అవినీతి జరిగినట్టే రుజువైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.