బుధవారం మళ్లీ ప్రళయమే: ట్రంప్‌ సంచలన ప్రకటన | Donald Trump Sensational Comments On Iran | Sakshi
Sakshi News home page

బుధవారం మళ్లీ ప్రళయమే: ట్రంప్‌ సంచలన ప్రకటన

Apr 18 2026 10:56 AM | Updated on Apr 18 2026 12:08 PM

Donald Trump Sensational Comments On Iran

వాషింగ్టన్‌: ఇరాన్‌, అమెరికా మధ్య మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. హార్మూజ్‌ విషయం, ఇరాన్‌తో చర్చలు అంశంలో అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.

కాగా, ఇరాన్​ ఒప్పందం కుదరకపోతే కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించకపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ గడువులోగా ఒప్పందం కుదురుతుందా లేదా అనే దానిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ బాంబుల మోత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి మూసి ఉంచిన హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ముగిసేదాకా వాణిజ్య నౌకలు అందులో రాకపోకలు సాగించవచ్చని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ప్రకటించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్‌ ఇరాన్‌ ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని మాత్రం తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. అలా అయితే హార్మూజ్‌ను మళ్లీ మూసి వేస్తామంటూ ఇరాన్​ వార్నింగ్ ఇచ్చింది.

మళ్లీ మూసివేస్తాం: ఇరాన్
ఇరాన్ పోర్టుల దిగ్బంధమనం కొనసాగుతుందని ట్రంప్‌ చేసిన ప్రకటనపై ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్‌ ఘాలిబఫ్‌ మండిపడ్డారు. తమ నౌకలను అడ్డుకుంటే హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. హార్మూజ్‌ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్‌ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని, అవన్నీ అబద్ధాలేనని ఘాలిబఫ్‌ తెలిపారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరని.. చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని విమర్శించారు. జలసంధికి సంబంధించి ప్రతి నిర్ణయం తామే తీసుకుంటామని రాసుకొచ్చారు. తాము ఇప్పటికే ప్రకటించిన మార్గంలోనే నౌకల రాకపోకలు సాగుతాయని పేర్కొన్నారు.

ఐఆర్‌జీసీ హెచ్చరిక.. 
హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ విదేశాంగమంత్రి ప్రకటించగా, IRGC నేవీ విభాగం మాత్రం పలు నిబంధనలు విధించింది. హార్మూజ్ గుండా వెళ్లే అన్ని నౌకలు తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలోనే పౌర, వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించాలని తెలిపింది. సైనిక నౌకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టంచేసింది. ఈ నిబంధనలన్నీ.. కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement