
మృతులను గౌరవించాలి
మృతదేహాలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేర్కొన్నారు.
ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
30 కార్పస్ క్యారీ బ్యాగ్స్ అందించిన ఏఎస్పీ శ్రీహరి
గుంటూరు క్రైం : మృతదేహాలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేర్కొన్నారు. గుర్తు తెలియని మృతదేహాలను విదేశాల తరహాలో గౌరవంగా తరలించేందుకు ఐటీ కోర్ ఏఎస్సై కొట్టే శ్రీహరి రూపొందించి తీసుకొచ్చిన కార్పస్ క్యారీ బ్యాగ్‌లను శనివారం ఆయన పరిశీలించారు. గుర్తు తెలియని మృతదేహాలను చాపలు, పాత గోతాలు, ఫ్లెక్సీల్లో చుట్టి తరలించడం లాంటి ఘటనలను చూసి చలించిన ఏఎస్సై ఇంటర్ నెట్‌లో పరిశీలించి ఖర్చుకు వెనుకాడకుండా కార్పస్ క్యారీ బ్యాగ్ (మృతదేహాలను తరలించే సంచి)లను తయారు చేశారు.
30 బ్యాగ్‌లను శనివారం ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చి అందజేశారు. వాటిని తిలకించిన ఎస్పీ ఏఎస్సైని వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లో వున్న మృతదేహాలనైనా తరలించ డానికి కార్పస్ క్యారీ బ్యాగ్‌లు ఎంతగానో దోహద పడతాయని చెప్పారు. 30 బ్యాగులను గుర్తు తెలియని మృతదేహాలు అధికంగా వుండే తాడేపల్లి, కొత్తపేట, గుంటూరు రూరల్ (నల్లపాడు), మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లకు కేటాయిస్తామని తెలిపారు.
వారంలో మరో 70 అందజేస్తా..
మృతదేహాలను తరలిస్తున్న విధానంలో మార్పు తీసుకురావాలనే కార్పస్ క్యారీ బ్యాగ్‌లను రూపొందించానని ఏఎస్సై శ్రీహరి చెప్పారు. రెండు నెలలు శ్రమించి నల్ల చెరువుకు చెందిన ఓ దర్జీ సహకారంతో వీటిని రూపొందించానని తెలిపారు. మరో వారం రోజుల్లో ఇంకో 70 రూపొందించి అందజేస్తానని ఎస్పీకి వివరించారు. మృతదేహాలను జాగ్రత్తగా భద్రపరిస్తే దర్యాప్తు సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. బ్యాగ్‌లను సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ జే భాస్కరరావును ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో డీస్పీలు బి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాస్, సీఐ కే.శ్రీనివాసరావు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.