నీటి పిల్లులు, మరో ఐదు క్షీరదాలు గుర్తింపు

Water cats and five other mammals are recognized in East Godavari - Sakshi

గోదావరి డెల్టా ప్రాంతంలో ప్రత్యేక పరిశోధన చేపట్టిన ఏపీ అటవీశాఖ

కెమెరాలకు చిక్కిన 115 నీటి పిల్లులు

పరిశోధన పత్రాన్ని విడుదల చేసిన కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

కాకినాడ సిటీ: తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతం, ఇతర గోదావరి డెల్టా ప్రాంతంలోని మడ అడవుల్లో 115 నీటి పిల్లులను మరో ఐదు రకాల క్షీరదాలను గుర్తించారని కలెక్టర్‌ కార్తికేయమిశ్రా తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం రాష్ట్ర అటవీశాఖ వన్యమృగ సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గోదావరి డెల్టా మడ అడవుల్లో నీటి పిల్లులు, ఇతర క్షీరదాలపై చేపట్టిన పరిశోధన పత్రాన్ని ఆయన విడుదల చేశారు. కార్తికేయమిశ్రా మాట్లాడుతూ అటవీశాఖ ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా గోదావరి డెల్టాలోని మడ అడవుల్లో క్షీరదాలపై పరిశోధన జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న మడ అడవులు దేశంలో రెండో స్థానాన్ని ఆక్రమిస్తున్నాయని, ఈ పరిశోధన ద్వారా అంతరించిపోతున్న వన్యమృగ సంరక్షణకు వీలవుతుందని తెలిపారు.

ఈ పరిశోధనను 2018 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కోరింగ వన్య మృగ సంరక్షణ ప్రాంతం, ఇతర మడ అడవుల్లో చేపట్టారన్నారు. ఈ పరిశోధన కోసం 94 కెమెరా పాయింట్లలో అధిక నాణ్యత ఉన్న కెమెరాలను వినియోగించారని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా వివరించారు. 115 నీటి పిల్లులతోపాటు ఇండియన్‌ గోల్డెన్‌ జాకాల్, ర్విసెస్, మాకాక్యూ, స్మూత్‌ కోటెడ్‌ ఓటర్, జంగిల్‌ క్యాట్, మంగూస్‌ వంటి క్షీరదాలను గుర్తించారన్నారు. వీటిలో గుర్తించిన జాకల్‌ (నక్క) సంతతి సాధారణంగా మెట్ట ప్రాంతంలో ఉంటుందని, ఇవి తీర ప్రాంతంలోనూ సంచరిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైందని కలెక్టర్‌ వివరించారు. ఈ సందర్భంగా పరిశోధనకు శ్రీకారం చుట్టిన వన్యమృగ విభాగం, డీఎఫ్‌వో అనంతశంకర్‌ను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అభినందించారు.  జేసీ–2 సీహెచ్‌ సత్తిబాబు, డీఆర్‌వో ఎంవీ గోవిందరాజులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top