వేతనాల్లేవు..! | Wages Delayed With CFMS Technical issues Guntur | Sakshi
Sakshi News home page

వేతనాల్లేవు..!

May 2 2018 6:55 AM | Updated on May 2 2018 6:55 AM

Wages Delayed With CFMS Technical issues Guntur - Sakshi

ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగుల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన సీఎఫ్‌ఎంఎస్‌ విధానం అమలులో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో జీతాలు నిలిచిపోయాయి. మార్చి నెల నుంచి  వేతనాలు అందక ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో:  ఆర్థిక గణాంకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడంలో భాగంగా ప్రభుత్వం నూతనంగా సీఎఫ్‌ఎంఎస్‌(కాంప్రహెన్సివ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌సిస్టం) విధానాన్ని ప్రవేశపెట్టింది. ట్రెజరీ ద్వారా మంజూరయ్యే బిల్లులన్నింటినీ ఈ విధానం ద్వారానే దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 37,790 మంది ఉద్యోగులు, 39 వేల మంది పింఛనర్లతోపాటు, ఇతర బిల్లులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పంపాలని, కాగిత రహిత విధానం అమలు చేయాలని స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ‘శాప్‌’ అనే ప్రైవేటు సంస్థ ద్వారా అన్ని శాఖల్లోని ఉద్యోగులు, అధికారులకు శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

కొన్ని శాఖలకు సాంకేతికంగా అవసరమైన స్కానర్లు, కంప్యూటర్లు, ఇతర పరికరాలు అందజేశారు. వీటి వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో బిల్లులు దాఖలు చేయడంలో బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ఇంటర్నెట్‌ సదుపాయం కూడా వేగంగా లేకపోవడంతో ఒక బిల్లు అప్‌లోడ్‌ చేయడానికి రెండు నుంచి మూడు గంటలు పడుతోందని పలు శాఖల అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్లు పూర్తి సామర్థ్యంతో పని చేయక పోవడంతో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతీ నెల 18 నుంచి 25వ తేదీ మధ్య బిల్లులు ఖజానాశాఖకు సమర్పించాలని చెప్పారు. అయితే ప్రస్తుతం కొన్ని శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు బిల్లులు పొందుపర్చకపోవడంతో ఉద్యోగుల జీతాలపైన ప్రభావం చూపుతోంది. కొన్నిశాఖల అధికారులు బిల్లులు ఆలస్యంగా సమర్పించడం, ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులకు డబ్బులు చెల్లించాలా లేదా అనే విషయంలో అనుమతులు రాకపోవడంతో పెండింగ్‌లో ఉంచారు.

ప్రధానంగా తలెత్తుతున్న సమస్యలివే..
కొన్ని శాఖలలో ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి సిస్టంలు, స్కానర్లు, ప్రింటర్లు, నెట్‌ స్పీడ్‌ లేకపోవడంతో జీతాల బిల్లులు ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. డిపార్టుమెంట్‌ సంబంధించి అధికారులకు సాంకేతిక పరిజ్ఞానంపైన శిక్షణ ఇవ్వలేదు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీనికి సంబంధించి ప్రధానంగా కొన్ని శాఖల అధికారులు ఇంతవరకు శిక్షణ తీసుకోలేదు. దీంతోనే సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలకు సంబంధించిన జీతాలు సైతం మార్కెటింగ్‌ శాఖతోపాటు, పలుశాఖల ఉద్యోగులకు రాలేదు. ఎయిడెడ్‌ ఉద్యోగులకు సంబంధించి సీఎఫ్‌ఎంఎస్‌ విధానం గుదిబండగా మారింది.

దీంతో ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్‌శాఖకు సంబంధించి పీఏవో ద్వారా జీతాలు తీసుకునేవారు. వారిలో హెచ్‌ఆర్‌ఎంఎస్‌ సిబ్బందికి చెక్కు ద్వారా జీతాలు చెల్లించేవారు. వీరికి సంబంధించి బ్యాంకుల్లో ఐడీలు లేకపోవడంతో ప్రభుత్వం ముందస్తుగా ఒక్కోక్కరికి రూ.75వేలు అడ్వాన్సును చెల్లించింది. మొత్తంగా ఏప్రిల్‌ నెల జీతాలు పూర్తి స్థాయిలో ఉద్యోగులకు అందేలా చేసేందుకు ఆయా డిపార్టుమెంటల్‌ అధికారులు, ఖజానా సిబ్బంది పూర్తి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఖజానా కార్యాలయానికి సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో 2,250 బిల్లులు రాగా 950 బిల్లులు పాస్‌ అయినట్లు సమాచారం. 600 బిల్లులు డీడీవోల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా బిల్లులు పాస్‌చేసేందుకు ఖజానా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ఖజానా అధికారులు పేర్కొన్నారు.

అందరికి జీతాలు అందేలా చేస్తాం
జిల్లాలోని ఉద్యోగులు , పింఛనర్లు అందరికి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. నిర్ధేశిత సమయం మించినప్పటికీ ఆన్‌లైన్‌ ద్వారా వస్తున్న వేతన బిల్లులను ఖచ్చితంగా పాస్‌ చేసేలా ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. నూతనంగా ప్రవేశపెట్టిన సాంకేతిక విధానం వల్ల చిన్న చిన్న సాంకేతిక సమస్యల తలెత్తుతున్న మాట వాస్తవం. కాని ఇందులోని బాలారిష్టాలను అధిగమించి బిల్లులతోపాటు, వేతనాలు ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం.– ఎన్‌.సదాశివరావు, ఉప సంచాలకుడు, జిల్లా ఖజానాశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement