పరీక్షలు ప్రశాంతం | VRO, VRA exams held peacefully | Sakshi
Sakshi News home page

పరీక్షలు ప్రశాంతం

Feb 3 2014 1:35 AM | Updated on Sep 2 2017 3:17 AM

పరీక్షలు ప్రశాంతం

పరీక్షలు ప్రశాంతం

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్న ఐదుగురు అభ్యర్థులపై అధికారులు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. విజయనగరం, వరంగల్, ప్రకాశం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పరీక్షల ప్రాథమిక ‘కీ’ ఈనెల 4వ తేదీన విడుదల చేస్తారు. అభ్యంతరాలుంటే పరిగణనలోకి తీసుకుని పదో తేదీన ఫైనల్ ‘కీ’ విడుదల చేస్తారు. 20వ తేదీన పరీక్ష ఫలితాలు ప్రకటిస్తారు. 26 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించి నెలాఖరుకల్లా నియామక పత్రాలు అందజేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. 1,657 వీఆర్‌వో పోస్టుల భర్తీకి 3,684 కేంద్రాల్లో 11,84,234 మంది(87.76 శాతం) హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 38,481(91.79 శాతం) మంది పరీక్ష రాశారు.
 
 వీఆర్‌వో పోస్టుకు 13,51,220 మంది దరఖాస్తు చేసుకోగా 13,49,375 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
 
 వీఆర్‌వో పరీక్షకు నిజామాబాద్( 91.79 శాతం), వరంగల్ (90.98), విజయనగరం (90.08 శాతం), ప్రకాశం (81.06), ఆదిలాబాద్ (83.67 శాతం) మంది హాజరయ్యారు.
 
 4,305 వీఆర్‌ఏ పోస్టులకు 195 కేంద్రాల్లో 88,609 మంది (88.10 శాతం) హాజరయ్యారు.
 
 వీఆర్‌ఏ పరీక్షకు 1,00,704 మంది దరఖాస్తు చేసుకోగా 1,00,579 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వరంగల్(92.03 శాతం), విజయనగరం (90.54), శ్రీకాకుళం (90.46 శాతం), రంగారెడ్డి (81.26 శాతం), విశాఖపట్నం(83.11 శాతం) మంది పరీక్ష రాశారు.
 
 ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద బ్రౌన్ ఫార్మసీ కాలేజీలో ప్రశ్నపత్రాలు సరిపోకపోవటంతో పరీక్ష గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహించారు.

 

పారదర్శకంగా పోస్టుల భర్తీ: రఘువీరా
 
 అనంతపురం, న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో వీఆర్ వో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లు చెప్పుకుని ఉద్యోగాలిప్పిస్తామనే వారి మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. విజయనగరం జిల్లాలో కొన్ని పంచాయతీల్లో వీఆర్‌ఏ అభ్యర్థులు కుమ్మక్కై ఒక అభ్యర్థే పరీక్షకు హాజరయ్యేలా నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై కలెక్టర్‌తో మాట్లాడి అభ్యర్థులందరూ పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అపోహలు, అనుమానాలు ఉన్నా హెల్ప్ డెస్క్ 040-23201530, 83749 99574, 97049 57930 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement