వచ్చేనెల 2న ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలంలో నిర్వహించే వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు.
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: వచ్చేనెల 2న ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలంలో నిర్వహించే వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆయన శుక్రవారం వీడియోకాన్ఫ్‌రెన్‌స నిర్వహించారు. వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షల ఏర్పాట్లు, జాతీయ ఓటరు దినోత్సవం, రెవెన్యూ సదస్సులపై జేసీ సురేంద్రమోహన్‌తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఫిబ్రవరి 2న ఉదయం గంటల నుంచి 12 గంటల వరకు వీఆర్వోల పరీక్షలు, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏల పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొత్తం 161 కేంద్రాల్లో వీటిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఈ పరీక్షలకు సమన్వయ అధికారిగా, ఆర్డీఓలు అదనపు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాలో 78 వీఆర్వో పోస్టులకు 70,055 మంది, 105 వీఆర్‌ఏ పోస్టులకు 3022 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీఆర్వో, వీఆర్‌ఏలకు ఉమ్మడిగా 1,194 దరఖాస్తులు అందాయన్నారు. ఈ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. అందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సదస్సుల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అన్ని మండల, డివిజనల్ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు.
ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సూచించారు. కలెక్టరేట్ నుంచి మండల రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులతో ఎన్నికల నిర్వహణపై జేసీ సురేంద్రమోహన్, ఎస్పీ రంగనాథ్‌తో కలసి వీడియోకాన్ఫిరెన్‌స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులను క్షేత్రస్థాయిలో క్షణంగా అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులతో చర్చించి ఎన్నికల పరంగా సమస్యత్మక, అత్యంత సమస్యత్మక గ్రామాలు, పోలింగ్‌కేంద్రాలను ఈ నెల 27 వరకు గుర్తించాలన్నారు.
ఈ నెలాఖరులో రెవెన్యూ, పోలీస్ మండల స్థాయి అధికారులను బదిలీ చేసే అవకాశం ఉన్నందున మండల స్థాయి ఉప తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు క్రీయాశీలకంగా భగస్వాములు కావాలన్నారు. సరిహద్దు రాష్ట్రాకు సమీపంలో ఉన్న గ్రామాలు, నక్సల్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం ఆర్డీఓలు అమయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సంజీవరెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.