సాక్షి, ఖమ్మం జిల్లా: సింగరేణి టెండర్లలో అవినీతి జరిగిందని కథనాలు వస్తున్నాయని.. తమ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మద్దులపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. కోల్ మైనింగ్ టెండర్లు అనుభవరం ఉన్నవారికే ఇస్తామన్నారు. తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.
‘‘మీకు మీకు ఉన్న పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. మా మంత్రులను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. ఇలాంటి కథనాల రాసే ముందు మమ్మల్ని వివరణ అడగాలి. మంత్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారు. సింగరేణిలో బొగ్గంతా మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. తప్పుడు ప్రచారాలతో అపోహలు సృష్టించొద్దు. మీడియాకు వివరాలు ఇచ్చేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటాను’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.
‘‘మొట్టమొదటి సారి నా రాజకీయ ప్రయాణం ఖమ్మం నుంచి జరిగింది. 20 సంవత్సరాలలో ఖమ్మం ఎప్పుడు వచ్చినా నన్ను అభిమానించారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు కోట్ల పదిహేను లక్షల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రేషన్ కార్డు రాకపోయినా అందరికీ ఇవ్వండి. ఉచిత విద్యుత్ మీద మొట్ట మొదటి సంతకం పెట్టింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.
..వైఎస్సార్ స్పూర్తితో ఈనాడు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు ఇచ్చాము. సన్నబియ్యం పథకం, ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం ఖమ్మంలోనే జరిగింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. కేసీఆర్ పేదలను దగా చేసిండు తప్ప ఇళ్ళు ఇవ్వలేదు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది.
..ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం పూర్తి కాకముందే ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రయత్నం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ల గురువు ఫామ్ హౌస్‌లో ఉన్నాడు.. ఫామ్ హౌస్‌లో ఉండి పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
..మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. 100 రోజుల్లో సమ్మక్క,సారక్క పనులు పూర్తి చేశాం. గత ముఖ్యమంత్రి ఏకపాత్రాభినయం చేశాడు. మేమందరం సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. కోల్ మైనింగ్ టెండర్‌లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఖమ్మం జిల్లాలో 1130 గ్రామపంచాయతీలు ఉంటే 790 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.


