కడుపు తరుక్కుపోతోంది.. | - | Sakshi
Sakshi News home page

కడుపు తరుక్కుపోతోంది..

Mar 10 2026 7:20 AM | Updated on Mar 10 2026 7:20 AM

భూదాన్‌ బాధితులతో కలిసి ధర్నాలో ఎమ్మెల్సీ కవిత

అరెస్ట్‌ చేసిన పోలీసులు, విడుదల తర్వాత దీక్ష ప్రారంభం

ఖమ్మం అర్బన్‌: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్‌ భూమిలో ఇటీవల ఇళ్ల కూల్చివేతతో రోడ్డున పడిన వారి ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులకు ఆడబిడ్డల ఉసురు తాకడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఖమ్మంలోని అంబేద్కర్‌ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల నిర్వాసితులను సోమవారం ఆమె పరామర్శించి మాట్లాడారు. పిల్లల పరీక్షల సమయాన రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. బాధితులను అనేక మంది నాయకులు చూసి వెళ్లినా, సమస్య పరిష్కారం కోసం నిజమైన ప్రయత్నాలు చేయలేదని పేర్కొన్నారు. బాధితుల ఇళ్లు ఎక్కడ నేలమట్టం చేశారో అదే ప్రాంతంలో వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కూల్చివేతలపై సీఎం, జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ర్యాలీ, ధర్నా

భూదాన్‌ బాధితులకు అండగా రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ విశారదన్‌ మహారాజ్‌, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తోట రాఘవేంద్ర ముదిరాజ్‌, పొడకంటి రాంబాబుతో పాటు గుడిశ బాలయ్య తదితరుల ఆధ్వర్యంలో ఖమ్మంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అంబేద్కర్‌ భవన్‌ నుంచి జెడ్పీ సెంటర్‌ వరకు ర్యాలీ కొనసాగగా అక్కడి అంబేద్కర్‌ విగ్రహం ఎదురుగా చేపట్టిన ధర్నాలో బాధితులు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. మూడు గంటల పాటు ధర్నా కొనసాగగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆర్‌డీఓ, ఏసీపీ రమణమూర్తి చర్చించినా నాయకులు వెనక్కి తగ్గలేదు. ఈమేరకు పోలీసులను మోహరించి బాధితులను వివిధ పోలీసుస్టేషన్లకు తరలించే క్రమాన తోపులాట జరిగింది. ఆపై కల్వకుంట్ల కవిత, విశారదన్‌ తదితరులను ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

దీక్ష ప్రారంభం

ఖమ్మం రూరల్‌ పోలీసుస్టేషన్‌కు కవిత, విశారదన్‌ తదితరులను తీసుకెళ్లాక కొద్దిసేపటికి సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఆ తర్వాత వారు రాత్రి 9గంటలకు తిరిగి అంబేద్కర్‌ భవన్‌కు చేరుకుని నిర్వాసితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

43మందిపై కేసు

అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న అదుపులోకి తీసుకునే క్రమాన మహిళలు, పోలీసు సిబ్బంది నడుమ వాగ్వాదం జరిగింది. ఈమేరకు ఏఆర్‌ కానిస్టేబుల్‌ సునీత, సివిల్‌ కానిస్టేబుల్‌ హేమలత తమను గాయపరిచారని ఇచ్చిన ఫిర్యాదుతో కల్వకుంట్ల కవిత, విశారదన్‌ సహా 43మందిపై వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు. జిల్లాకు సంబంధం లేని వారు వారు బాధితులను తప్పుదోవ పట్టించి, రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారన్నారు. సీసీ కెమెరాలు, వీడియో పుటేజీ ఆధారంగా విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసు సిబ్బందిపై దాడి చేసినా మిగతా వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement