ఫిర్యాదులు పరిష్కరించండి
బ్యాంకర్ల సమావేశంలో
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మంగాంధీచౌక్: ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు బ్యాంకులు తోడ్పాటు అందించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశంలో ఆయన బ్యాంకర్లతో పలు అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశిత రుణ పంపిణీ లక్ష్యంలో 78.53 శాతం నమోదైందని, ఆశించిన స్థాయిలో పురోగతి సాధించని బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ రంగ బ్యాంకులు సైతం లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఇక విద్యారుణాలు రూ. 97 కోట్లకు గాను రూ.22.56 కోట్లే పంపిణీ చేయడంపై ఆరా తీసిన ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, పంట రుణాలు, ఎంఎస్‌ఎంఈలు, మహిళా సంఘాలకు రుణ పంపిణీ, వీధి వ్యాపారులకు రుణాలపై సూచనలు చేశారు. అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్లాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం రవిప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ ఏడీ ఈ.నకుల్‌రెడ్డి, డీఎస్సీఓ ఏపీఎం జె.సరస్వతి, ఆర్‌బీఐ ఎల్‌డీఓ గోమతి, నాబార్డ్ డీడీఎం సుజీత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ప్రతీ ఫి ర్యాదును పరిశీలించి పరిష్కారానికి చొరవ చూ పాలని తెలిపారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


