ఫలితమిచ్చిన ‘అభయ హస్తం’ | - | Sakshi
Sakshi News home page

ఫలితమిచ్చిన ‘అభయ హస్తం’

Mar 10 2026 7:20 AM | Updated on Mar 10 2026 7:20 AM

● సీఎస్సార్‌లో సింగరేణి వినూత్న ప్రయోగం ● సివిల్స్‌కు పోటీపడే అభ్యర్థులకు ఆర్థికంగా అండ ● దేశ పాలనలో భాగం కానున్న 20 మంది..

ముందుకొచ్చిన సింగరేణి

● సీఎస్సార్‌లో సింగరేణి వినూత్న ప్రయోగం ● సివిల్స్‌కు పోటీపడే అభ్యర్థులకు ఆర్థికంగా అండ ● దేశ పాలనలో భాగం కానున్న 20 మంది..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి ప్రారంభించిన రాజీవ్‌ అభయ హస్తం పథకం సంస్థకు వన్నె తెచ్చింది. ఈ పథకం ద్వారా 202 మందికి ఆర్థిక సాయం అందించగా అందులో 20మంది విజయం సాధించి దేశ పాలనలో భాగస్వాములు కాబోతున్నారు. ఇదే తీరుగా మరిన్ని రంగాల్లో సమాజ ఉన్నతి కోసం సంస్థ కృషి చేయాలనే డిమాండ్‌ వస్తోంది.

క్రేజ్‌ ఎక్కువే..

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు కలెక్టర్‌, ఎస్పీ, ఫారెస్ట్‌ ఆఫీసర్‌, ఫారెన్‌ ఆఫీసర్‌, పోస్టల్‌, రెవెన్యూ వంటి 17రకాల పోస్టులకు ఎంపికవుతారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్‌ వంటి వృత్తులు, ఉద్యోగాల కంటే కూడా సివిల్‌ సర్వీసెస్‌కే యువతలో క్రేజ్‌ ఎక్కువ. దీనికి తగ్గట్టే 2025 బ్యాచ్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా 9.37లక్షల మంది ప్రాథమిక పరీక్షలకు హాజరైతే 14వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇందులో 2,736 మంది ఇంటర్వ్యూ వరకు రాగా, 958మంది సివిల్స్‌కు ఎంపికయ్యారు.

సన్నద్ధం కావడమే ఓ ‘పరీక్ష’

కఠినమైన ఈ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన, మంచి మెటీరియల్‌ వంటివి తప్పనిసరి. వీటికి తోడు అభ్యర్థులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కోచింగ్‌, నిపుణుల గైడెన్స్‌ కూడా అవసరం. అత్యంత పోటీ ఉండే ఈ పరీక్షలకు సిద్ధం కావడంలో వ్యక్తిగత సామర్థ్యం, ప్రతిభ ఎంత ఉన్నా.. అదనపు సమాచారం, శిక్షణ కోసం మరింతగా వ్యయం చేయాల్సి ఉంటుంది. దీంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) వారు సివిల్స్‌లో అడ్డంకులు దాటడంలో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక దన్ను అందక వారి కలలు సాకారం చేసుకోవడం కష్టమవుతోంది.

202 మందికి ఆర్థిక సాయం

ప్రిలిమ్స్‌ల్లో విజయం సాధించిన తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు మెయిన్స్‌కు ప్రిపేర్‌ అయ్యేందుకు సింగరేణి ఆధ్వర్యాన ముందుగా రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తారు. ఇక్కడ విజయం సాధించి ఇంటర్వ్యూ దశకు వెళ్లిన వారికి మరో రూ.లక్ష సాయం చేస్తున్నారు. ఈ ఏడాది 202 మందికి సింగరేణి నుంచి తొలి విడత సాయం అందగా.. ఇందులో 51మంది ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. ఇటీవల విడుదల చేసిన తుది జాబితాలో వారిలో 20మంది సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. మొత్తంగా హైదరాబాద్‌ సెంటర్‌ నుంచి ఈసారి సివిల్స్‌కు 30మందికి పైగా అభ్యర్థులు ఎంపికై తే అందులో రాజీవ్‌ అభయహస్తం పథకాన్ని ఉపయోగించుకున్న వారే 20మంది ఉండడం విశేషం. ఇందులో ఓబీసీ కేటగిరీ నుంచి రికార్డు స్థాయిలో పది మంది విజేతలుగా నిలిచారు. ఎస్టీలు నలుగురు, ఎస్సీలు ముగ్గురు ఉండగా మిగిలిన ముగ్గురు ఈడబ్ల్యూఎస్‌ నుంచి ఉన్నారు.

రాష్ట్ర కేబినెట్‌లో సింగరేణి బాధ్యతలను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క చూస్తున్నారు. విద్యార్థి దశలో సివిల్స్‌ పరీక్షలకు సిద్ధం అవడం, విజయం సాధించడంలో సాధక బాధకాలను ఆయన గుర్తించారు. అలాగే దినసరి కూలీగా జీవితాన్ని ప్రారంభించి దూరవిద్య విధానంలో డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌లో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికై న ఎన్‌.బలరాంనాయక్‌ సింగరేణి సీఎండీగా వ్యవహరించారు. సివిల్స్‌ పరీక్షలకు సంబంధించిన విషయాలపై అవగాహన ఉన్న డిప్యూటీ సీఎం, సీఎండీ కలిసి.. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా 2024 జూలై 20న రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement