తెలంగాణ, ఏపీ నుంచి..
● ఖమ్మంలో పెరుగుతున్న మిర్చి క్రయవిక్రయాలు ● పొరుగు జిల్లాలు, పక్క రాష్ట్రం నుంచీ తీసుకొస్తున్న రైతులు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నానాటికీ మిర్చి అమ్మకాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ధర పుంజుకోవడం, చైనా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ నుంచి ఎగుమతిదారులకు ఆర్డర్లు పెరుగుతుండడంతో అమ్మకాలు ౖపైపెకి వెళ్తున్నాయి. తేజా రకం మిర్చి కొనుగోళ్లలో ఖమ్మం మార్కెట్‌కు పేరు ఉండడం.. ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం తగ్గి దిగుబడులు అంతంతమాత్రంగా ఉండడంతో ఇక్కడ మిర్చికి డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన సోమవారం మార్కెట్‌కు రైతులు 50 వేల బస్తాల మిర్చి విక్రయానికి తీసుకొచ్చారు. ఫిబ్రవరి మూడోవారం నుంచి నిత్యం 25వేల నుంచి 35వేల బస్తాల వరకు వస్తుండగా గత శుక్రవారం 40 వేల బస్తాల మిర్చి వచ్చింది.
నిర్మాణలను పరిశీలించిన డైరెక్టర్
ఖమ్మం మార్కెట్‌లో రూ.155.30 కోట్ల నిధులతో చేపడుతున్న మిర్చి మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను సోమవారం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పరిశీలించారు. మొత్తం ఏడు షెడ్లకు గాను ఇప్పటికే ఆరు షెడ్ల పనులు చివరి దశకు చేరగా, మరో షెడ్డు పనులు ప్రారంభమయ్యాయి. అలాగే, యార్డులో ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ మేరకు నిర్మాణాలను పరిశీలించిన డైరెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. ఏడీ రవికుమార్, జేడీ లక్ష్మణుడు, ఈఈ యల్లేష్, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాలు, సరిహద్దు ఏపీ నుంచి రైతులు ఇక్కడకు మిర్చి తీసుకొస్తున్నారు. తేజ రకం మిర్చికి కాస్త మెరుగైన ధరే ఉండడంతో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలతో పాటు ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు వస్తున్నారు. సోమవారం జెండాపాట(గరిష్ట) ధర రూ. 19,225, మోడల్ ధర రూ.18వేలుగా నమోదైంది. కాగా, మిర్చి క్రయవిక్రయాలు, కాంటాలు, తోలకాలను అధికారులు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు.


