పద్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి
కొణిజర్ల: బాలికలు శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత కలిగి ఉండాలని పద్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి అన్నారు. కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో సైన్స్ ఎక్స్‌పో(ప్రేరణ) నిర్వహించారు. ఇందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గురుకులాలకు చెందిన బాలికలు పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధి, పునర్వినియోగ శక్తి వనరులపై ప్రదర్శించిన ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. ఎక్స్‌పోను అరోరా డిగ్రీ కళాశాల ఆసిస్టెంట్ ప్రొఫెసర్ సీత, గురుకులాల ఉమ్మడి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అరుణకుమారితో కలిసి చంద్రమౌళి పరిశీలించాక విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. బాలికలు పరిశోధనా నైపుణ్యాలు పెంచుకోవాలని, కాలానికి అనుగుణంగా సాంకేతికతకు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె.రజని, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా రైతులకు పురస్కారాలు
వైరా/ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రాణిస్తున్న జిల్లాకు చెందిన పలువురు రైతులకు పురస్కారాలు లభించాయి. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఆది, సోమవారం మెగారైతు మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన నల్లమల వెంకటేశ్వరరావుతో పాటు అభ్యుదయ రైతులు వెంపటి లక్ష్మీనారాయణ(సత్తుపల్లి), పి.భాస్కర్‌రావు(నేలకొండపల్లి), శ్రీవల్లి(మధిర) రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారని వైరా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి తెలిపారు.
నేటి నుంచి పశువులకు
గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు
ఖమ్మంవ్యవసాయం: జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి బి.పురంధర్ తెలిపారు. ప్రతీ సంవత్సరం ఆరు నెలలకోసారి ఈ వ్యాక్సినేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మూడు నెలలు నిండిన గేదె, గోజాతి పశువులకు టీకాలు వేస్తామని, ఏప్రిల్ 9వ తేదీ వరకు నెల పాటు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. చూడి పశువులకు కూడా సురక్షితమైనవి అయినందున రైతులు ఈ టీకాలు వేయించి ‘భారత్ పశుదాన్ యాప్’లో నమోదు చేసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.
గర్భాశయ ముఖద్వార కేన్సర్ కట్టడికి టీకా
నేలకొండపల్లి: నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఓ) కె.రాజశేఖర్‌గౌడ్ సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఉద్యోగులకు సూచనలు చేశాక ఆయన మాట్లాడారు. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను కట్టడి చేసేందుకు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. 2011 జనవరి నుంచి 2012 ఫిబ్రవరి మధ్యలో పుట్టిన ఆడపిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. పాలేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రమేష్, తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, వైద్యాధికారులు శ్రావణ్‌కుమార్, రాజేష్, మంగళ, సర్పంచ్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


