విజయనగరం: ఇక ప్రచార యుద్ధం షురూ!

Vizianagaram: Namination Withdraw Process Is Completed, Election Campaign Is Start - Sakshi

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం

ప్రచారం ముమ్మరం చేయనున్న మిగిలిన అభ్యర్థులు

తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపిస్తున్న కలవరం

అసలైన యుద్ధం మొదలు కానుంది. నామినేషన్ల ప్రక్రియలో అన్ని అంకాలూ గురువారంతో ముగిశాయి. ఉపసంహరణల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఇప్పటికే పోటీలో ఉన్నవారు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా కొందరు అభ్యర్థులు హోరాహోరీ పోరాడుతున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీలోకి వలసల జోరు ఎక్కువైంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతిరోజూ వందలకొద్దీ కుటుంబాలు తమ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఆ పార్టీ నాయకులు వారిని చేర్చుకోవడంలో తలమునకలవుతున్నారు. ఇప్పటికే వరుసగా క్యూకడుతున్నవారిని చూసి అధికార తెలుగుదేశం పార్టీలో గుబులు మొదలైంది. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉపసంహరణ ప్రక్రియ గురువారం ముగిసింది. ఇక బరిలో మిగిలిన అభ్యర్థులు ప్రచార పర్వంలోకి పూర్తి స్థాయిలో దిగనున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు, విమర్శల కత్తులు సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ(వైఎస్సార్‌సీపీ), తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోరు సాగనుంది. జిల్లాలోని విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో 2014 ఎన్నికల్లో టీడీపీయే పైచేయి సాధించింది.

విజయనగరం పార్లమెంట్‌ స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాలను అప్పట్లో కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన బొబ్బిలి ఎమ్మెల్యేను లాక్కున్న టీడీపీ తన బలం ఏడుకు పెంచుకుంది. కానీ ఈ సారి ఎన్నికల్లో పరిస్థితులు మారనున్నట్టు కనిపిస్తోంది. గడచిన ఐదేళ్లలో అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ చేసిన అరాచకాలు, అన్యాయాలకు జనం విసిగిపోయారు. సరైన సమయం ఎప్పుడొస్తుందా, టీడీపీకి బుద్ధిచెప్పి తమను ఇన్నాళ్లూ ఎక్కితొక్కిన నేతలను ఇంటికి సాగనంపుదామని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైపు పరుగులు దీస్తున్న నేతలు, కార్యకర్తలే దీనికి నిదర్శనం.

ఇంటిపోరుతో సతమతం
ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీలో ఇంటిపోరు ఎక్కువైంది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత రావడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. జిల్లాలో టీడీపీ అధికారంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీలో అసంతృప్తులు భారీగానే తెరపైకి వచ్చారు. సిట్టింగ్‌లకు టిక్కెట్టు ఇవ్వవద్దని బహిరంగంగానే అధినేతకు స్పష్టం చేశారు. అయినా ప్రజలు, పార్టీ నేతల అభిప్రాయం కంటే తన స్వార్థ, సొంత నిర్ణయాలకే ప్రాధాన్యమిచ్చే బాబు మాత్రం అసంతృప్తుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే టిక్కెట్టు కేటా యించి తప్పు చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకోసం కష్టపడ్డ నేతలు చంద్రబాబు తీరుతో తీవ్ర మనో వ్యధకు లోనయ్యారు. తమకు ఎన్నటికీ పార్టీలో గుర్తింపు రాదని తెలుసుకున్నారు. వారిలో కొందరు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపారు. మరికొందరు ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోతున్నారు.

అభ్యర్థుల ఎంపికలోనే తేడాలు
అభ్యర్థుల ఎంపికలోనే ఇరుపార్టీల వైఖరి తేటతెల్లమైంది. పార్టీ కోసం కష్టపడ్డవారికి, సామాన్యులకు, ఎలాంటి అవినీతి మరకలు లేనివారికి వైఎసాŠస్‌ర్‌సీపీ టిక్కెట్లు ఇచ్చింది. టీడీపీ మాత్రం సిట్టింగ్‌లకు, కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చింది. విజయనగరంలో మాత్రం బీసీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని ఎంపీ అశోక్‌ కుమార్తెకు టిక్కెట్టు ఇచ్చిం ది. అర్హులను కాదని ఒకే కుటుంబంలో తండ్రీ, కూతుళ్లకు టిక్కెట్టు ఇవ్వడం ద్వారా తమకు తమ వ్యక్తులే ప్రాధాన్యమనే విషయాన్ని చెప్పకనే చెప్పింది.

ఇవన్నీ గమనించిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిం దని గ్రహించారు. వైఎస్సార్‌సీపీకి జైకొడుతూ ఆ పార్టీ కండువాలు వేసుకుంటున్నారు. దీంతో నిత్యం వైసీపీ నేతలు ఇతర పార్టీల నుంచి వస్తున్న వలస నేతలు, కార్యకర్తలను ఆహ్వానించడంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మరోవైపు రావాలి జగన్‌– కావాలి జగన్‌ అంటూ ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. టీడీపీ మాత్రం మళ్లీ నువ్వేరావాలి అనే నినాదాన్ని జనానికి చెబితే ఎందుకు బాబూ మళ్లీ నువ్వే అంటారని భయపడుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top