ఆ భరోసాతో స్వర్ణ కాంతులు | Viswa Brahmins Happy With YS Jagan Promises | Sakshi
Sakshi News home page

ఆ భరోసాతో స్వర్ణ కాంతులు

Mar 15 2019 8:01 AM | Updated on Mar 28 2019 5:27 PM

Viswa Brahmins Happy With YS Jagan Promises - Sakshi

విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్‌ ఏర్పాటు అంశంపై చర్చిస్తున్న స్వర్ణకారులు

పేరులో స్వర్ణముంది. బతుకు మాత్రం దుర్భరంగా మారింది. ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్టు వారి జీవితాలు సాగిపోయేవి. ఇప్పుడు పూట గడవటమే కష్టంగా మారింది. స్వర్ణకారుల జీవితంలో చీకట్లు అలముకున్నాయి. ఇప్పుడు వారంతా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనే భారం వేశారు. ఆదుకుంటామని ఆయన ఇచ్చిన భరోసాతో కొండంత ధైర్యాన్ని నింపుకున్నారు.

పార్వతీపురం : ముక్కు పుడకల నుంచి మంగళ సూత్రాల వరకు.. ఉంగరం మొదలుకుని నెక్లెస్‌ వరకు అన్నీ రెడీమేడ్‌ దొరుకుతున్నాయి. మాకు బతుకుదెరువు లేకుండా పోయింది’ అని స్వర్ణకారులంతా ముక్తకంఠంతో చెప్పారు. స్వర్ణకారుల జీవితాలు ఎలా ఉన్నాయి, వారు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అన్న అంశంపై పార్వతీపురం స్వర్ణకారులతో ‘సాక్షి’ రచ్చబండ నిర్వహించింది. పొట్నూరి రవికిరణ్‌ మాట్లాడుతూ.. ‘ఆభరణాల రంగంలోకి కార్పొరేట్‌ సంస్థలు వచ్చాక స్వర్ణకారులు తయారు చేసే ఆభరణాలకు డిమాండ్‌ తగ్గింది. కొర్పొరేట్‌ వ్యాపారులతో కొంతవరకు అయినా పోటీ పడాలంటే.. మేం కూడా యంత్రాలు కొనాలి. విద్యుత్‌ చార్జీలు భరించాలి. అంత సొమ్ము మా దగ్గర లేదు. ఏం చేస్తాం’ అని వాపోయాడు. ‘రసాయనాల వాడకం వల్ల మా ఆరోగ్యం దెబ్బతింటోంది. 50 ఏళ్లకే మేం మంచాన పడుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు’ అని సింహాద్రి దుర్గారావు అనే స్వర్ణకారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తమ సమస్యలు తెలుసుకున్నారని స్వర్ణకారులు చెప్పారు. ఉపాధి లేక అల్లాడుతున్న తమకు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసా కొండంత ధైర్యాన్ని నింపిందన్నారు. తమ జీవితాల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసిందని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ పాలిట దేవుడిలా కనిపిస్తున్నారని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. స్వర్ణకారుల జీవితాల్లో వెలుగులు నిండాలంటే ఏం చేయాలి, వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలేమిటనేది వారి మాటల్లోనే..- బంకపల్లి వాసుదేవరావు

రాజన్న పాలనలో లబ్ధి పొందాం
వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో స్వర్ణకారులమైన మేం అనేకవిధాల అబ్ధి పొందాం.  ఇళ్లు వచ్చాయి. రుణాలు ఇచ్చారు. ఆయన మరణంతో కార్పొరేషన్‌ ఏర్పాటు ఆగిపోయింది. టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్‌ను పక్కన పెట్టి ఫెడరేషన్‌ను ముందుకు తెచ్చింది. దీనివల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మాకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తారు. తద్వారా అందరికీ రుణాలు అందుతాయి. .
– ముంతా సంతోష్‌కుమార్, స్వర్ణకారుడు

విద్యుత్‌ రాయితీ ఇవ్వాలి
బంగారు ఆభరణాల విక్రయాల్లోకి కార్పొరేట్‌ శక్తులు వచ్చిన తరువాత స్వర్ణకారులు తయారు చేసే ఆభరణాలకు డిమాండ్‌ తగ్గింది. బంగారు ఆభరణాలు తయారు చేసే యంత్రాలు కొనుగోలు చేయాలంటే  పెట్టుబడులు కావాలి. కార్పొరేషన్‌ ఏర్పాటైతే ఈ సమస్య తీరిపోతుంది. యంత్రాలను వినియోగిస్తే విద్యుత్‌ ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులకు విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు ఇచ్చి ఆదుకోవాలి. ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆయన ఒక మాట ఇస్తే.. మాట మీద నిలబడే వ్యక్తి. అందుకే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం.– పొట్నూరు రవికిరణ్, స్వర్ణకారుడు

జిల్లాకో పారిశ్రామిక శిక్షణ కేంద్రం కావాలి
బంగారు ఆభరణాల తయారీపై ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే యువతకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన వారికి బ్యాంకుల్లో బంగారం నాణ్యత, తూకం వేసే ఉద్యోగాలు ఇవ్వాలి. కార్పొరేట్‌ వ్యాపారులకు నగలు తయారు చేసేలా శిక్షణ ఇవ్వాలి.– పట్నాల వెంకట్రావు, కార్యదర్శి, స్వర్ణకార సంఘం, పార్వతీపురం

తాళిబొట్ల తయారీ హక్కు మాకే ఇస్తామన్నారు
తాళిబొట్లను తయారు చేసుకునే హక్కును స్వర్ణకారులకే ఇస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన విశ్వ బ్రాహ్మణులకు అనేక హామీలు ఇచ్చారు. ఉపాధి అవకాశాలు కొరవడుతున్న సమయంలో తాళిబొట్లు తయారు చేసే హక్కును మాకు ఇస్తామని చెప్పడంతో స్వర్ణకార యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మా కష్టాలు విన్న నాయకుడు ఆయనొక్కడే. ఆయన అధికారంలోకి రాగానే మాకు మంచి రోజులొస్తాయి – వి.చంద్రశేఖర్, స్వర్ణకారుడు

రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు
విశ్వబ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీ సీటు ఇచ్చి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రత్యేక కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పారు. విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న అన్నివర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చారు. ఆయన మాటకు కట్టుబడి ఉండే మనిషి. అందువల్ల ఆ మాటను విశ్వసిస్తూ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు అండగా ఉండాలని భావిస్తున్నాం– నడితోక శంకర్రావు, అధ్యక్షుడు, స్వర్ణకార సంఘం, పార్వతీపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement