మరో వేసవి!

Vishakha People Trouble With Sun Heat - Sakshi

ఎండ, ఉక్కపోతతో నగర ప్రజలు సతమతం

ఉష్ణోగ్రత సాధారణంగానే ఉన్నా వేడి సెగతో ఇబ్బందులు

వాతావరణంలో మార్పులతోనే ఈ పరిస్థితి

ఒకటి రెండు రోజులు ఇదే తీవ్రత

వాతావరణ నిపుణుల హెచ్చరి‍‍క

సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా శ్రావణ మాసంలో.. అందునా శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్‌ రోజుల్లో సూర్యుడు చల్లని చూపులతో.. వరుణుడు చిరుజల్లులతో ఆశీర్వదించడం.. ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో పండు గ జరుపుకోవడం ఆనవాయితీ.. కానీ ఈసారి మాత్రం అటు సూరీడు.. ఇటు వరుణుడు.. ఇద్దరూ సిరికన్ను వేశారు. చినుకు జాడ లేకపోగా.. భానుడి తీక్షణతతో నగరం నిప్పుల కొలిమిలా మారింది. గాలి లేక.. ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడారు. గురువారం కాసిన ఎండ నడివేసవిని తలపించింది. భానుడి భగభగల ధాటికి నగరవాసుల నాలుక పిడచ కట్టుకుపోయింది. తెల్లవారుజామున కురిసిన చిరుజల్లులు, ఆపై మబ్బుల వాతావరణం కొద్దిసేపట్లోనే మాయమయ్యాయి. ఆ తర్వాత నుంచి సాయంత్రం వరకు నగర ప్రజలకు సూర్యుడు చుక్కలు చూపించాడు. వానాకాలంలో నగరం నిప్పుల కుంపటిలా మారిపోయింది. మే నెలను తలపిస్తూ ఉదయం 9 గంటల నుంచే వేడి సెగలు మొదలయ్యాయి.

గత కొద్ది రోజులుగా మేఘావృత వాతావరణం, చిరు జల్లులతో కాసింత ఊరట చెందిన నగరవాసులు.. గురువారం ఎండ తీవ్రతతో బెంబేలెత్తిపోయారు. గాలి కూడా లేకపోవడంతో ఉక్కపోత పెరిగింది. దీంతో ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక జనం సతమతమయ్యారు. వాహనదారులు, ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. ఎండ కారణంగా దాహార్తి పెరగడం.. ఎక్కడా చలివేంద్రాలు లేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సరైన వానలు కురవకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తేమ శాతం పెరగడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని అభిప్రాయపడ్డారు. ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నప్పటికీ వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే వేడికి ప్రధాన కారణమని వెల్లడించారు. నగరంలో గురువారం 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.  ఒకట్రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top