breaking news
pepoles troubles
-
మరో వేసవి!
సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా శ్రావణ మాసంలో.. అందునా శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ రోజుల్లో సూర్యుడు చల్లని చూపులతో.. వరుణుడు చిరుజల్లులతో ఆశీర్వదించడం.. ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో పండు గ జరుపుకోవడం ఆనవాయితీ.. కానీ ఈసారి మాత్రం అటు సూరీడు.. ఇటు వరుణుడు.. ఇద్దరూ సిరికన్ను వేశారు. చినుకు జాడ లేకపోగా.. భానుడి తీక్షణతతో నగరం నిప్పుల కొలిమిలా మారింది. గాలి లేక.. ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడారు. గురువారం కాసిన ఎండ నడివేసవిని తలపించింది. భానుడి భగభగల ధాటికి నగరవాసుల నాలుక పిడచ కట్టుకుపోయింది. తెల్లవారుజామున కురిసిన చిరుజల్లులు, ఆపై మబ్బుల వాతావరణం కొద్దిసేపట్లోనే మాయమయ్యాయి. ఆ తర్వాత నుంచి సాయంత్రం వరకు నగర ప్రజలకు సూర్యుడు చుక్కలు చూపించాడు. వానాకాలంలో నగరం నిప్పుల కుంపటిలా మారిపోయింది. మే నెలను తలపిస్తూ ఉదయం 9 గంటల నుంచే వేడి సెగలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా మేఘావృత వాతావరణం, చిరు జల్లులతో కాసింత ఊరట చెందిన నగరవాసులు.. గురువారం ఎండ తీవ్రతతో బెంబేలెత్తిపోయారు. గాలి కూడా లేకపోవడంతో ఉక్కపోత పెరిగింది. దీంతో ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక జనం సతమతమయ్యారు. వాహనదారులు, ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. ఎండ కారణంగా దాహార్తి పెరగడం.. ఎక్కడా చలివేంద్రాలు లేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సరైన వానలు కురవకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తేమ శాతం పెరగడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని అభిప్రాయపడ్డారు. ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నప్పటికీ వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే వేడికి ప్రధాన కారణమని వెల్లడించారు. నగరంలో గురువారం 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఒకట్రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
నత్తనడకన వంతెన నిర్మాణం
ఉప్పొంగిన సండ్రవాగు కొట్టుకుపోయిన ప్రత్యామ్నాయ దారి పెరిగిన రవాణా దూరం సిరిసిల్ల రూరల్ : బద్దెనపల్లి గ్రామ సమీపంలోని సండ్రవాగుపై చేపట్టిన వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. బ్రిడ్జితోపాటు సమీపంలో కల్వర్టు నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో రూ.1.75కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఫిబ్రవరిలోనే పనులు ప్రారంభించారు. 2017 జనవరి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేయడంలో శ్రద్ధ చూపడంలేదు. దీంతో వంతెన ప్రస్తుతం పిల్లర్ల దశకే చేరింది. వంతెన పనులు జరుగుతున్నందున రాకపోకలు సాఫీగా సాగేందుకు పక్కనే తాత్కాలిక రోడ్డు నిర్మించారు. కానీ, నెలరోజుల క్రితం కురిసిన వర్షాలతో వచ్చిన వరదలతో అది కొట్టుకుపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సండ్రవాగు ఉప్పొంగడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే రామన్నపల్లి, బస్వాపూర్, బాలమల్లుపల్లి గ్రామస్తులకు రవాణా భారం పెరిగింది. వీరు సుమారు పది కిలోమీటర్ల అదనంగా ప్రయాణం చేసి నేరెళ్ల మీదుగా సిరిసిల్లకు చేరుకోవాల్సి వస్తోంది. కడుపునొప్పి వచ్చినా, కాలు గుంజినా పది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేస్తేనే సిరిసిల్లలోని ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉంది. బ్రిడ్జి పూర్తయితే çసుమారు ఆరు కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. ఈ విషయంపై కాంట్రాక్టర్ను సంప్రదించగా.. డైవర్షన్ రోడ్డు ఓసారి నిర్మించామని, వరద ఉధృతికి అది కొట్టుకుపోయిందని, మరోసారి నిర్మించేందుకు సంబంధిత శాఖ నిధులు మంజూరు చేయడంలేదన్నారు. అయినా, త్వరలోనే తాత్కాలిక రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. తిప్పలైతంది – పూర్మాణి మల్లారెడ్డి, గ్రామస్తుడు, బస్వాపూర్ వంతెన కాడ తాత్కాలిక రోడ్డు వేస్తే బాగుంటుంది. వాగుల నీళ్లున్నయ్. ఆటోలు, బస్సులు మా ఊరికి రావడంలేదు. నేరెళ్ల నుంచి పది కిలోమీటర్లు ప్రయాణం జేస్తేనే సిరిసిల్ల చేరుకోవచ్చు. తాత్కాలిక రోడ్డు వేయిస్తాం – రమేశ్, ఏఈ, పంచాయతీరాజ్ బద్దెనపల్లి వంతెన వద్ద నిర్మించిన తాత్కాలిక రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. వర్షపునీరు వెళ్లేందుకు వీలుగా పైపులు ఏర్పాటు చేసి మరోసారి ప్రత్యామ్నా రోడ్డు నిర్మించాలని కాంట్రాక్టర్ను ఆదేశించాం. వారం రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం.