ప్రాణాలు తీసిన పొగమంచు | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన పొగమంచు

Published Sun, Nov 16 2014 2:14 AM

ప్రాణాలు తీసిన పొగమంచు - Sakshi

విశాఖపట్నం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసులు నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఈ ఆరుగురూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా నక్కపల్లి మండలం గొడిచర్ల వద్ద పొగ మంచు వల్ల దారి కనిపించక వీరి కారు ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందినవారిలో గరిమెళ్ల గోవర్ధనరావు (40), కొండపల్లి శివరామకృష్ణశాస్త్రి (44), వంగా ప్రకాశరావు (55), నల్లమోతు రవి సుధాకర్ (47) ఉన్నారు.
 
* ఆగివున్న లారీని ఢీకొట్టిన ఇన్నోవా
* విశాఖపట్నం జిల్లా గొడిచర్ల వద్ద ప్రమాదం
* జిల్లా వాసులు నలుగురు మృతి    
* మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

నక్కపల్లి (విశాఖపట్నం జిల్లా) : పొగమంచు నలుగురి ప్రాణాలను బలిగొంది. మండలంలోని గొడిచర్ల జంక్షన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి విపరీతమైన పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా వస్తున్న, ముందు వెళుతున్న వాహనాలు కనపడని పరిస్థితి. ఈ నేపథ్యంలో శనివారం వేకువవారుజామున జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో విజయవాడకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. వివరాలిలా ఉన్నాయి.

విజయవాడ పరిసరప్రాంతాలకు చెందిన ఆరుగురు సిండికేట్‌గా ఏర్పడి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. విజయవాడలో విక్రయించిన భూమికి సంబంధించి అడ్వాన్సు తీసుకునేందుకు ఇన్నోవా కారులో శుక్రవారం రాత్రి విశాఖపట్నం బయలుదేరారు. విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలో గొడిచర్ల జంక్షన్ వద్ద  శనివారం వేకువజామున మూడు గంట లకు ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో విజ యవాడ పరిసర ప్రాంతాలకు చెందిన గరిమెళ్ల గోవర్ధనరావు (40, డ్రైవింగ్‌చేస్తున్న వ్యక్తి), కొండపల్లి శివరామకృష్ణశాస్త్రి (44), వంగా ప్రకాశరావు (55), నల్లమోతు రవి సుధాకర్ (47)  దుర్మరణం పాలయ్యారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న పరశురాం, ఎండీ ఫారుఖ్  తీవ్రంగా గాయపడ్డారు.  స్థానికుల సమాచారం మేరకు ఎస్సై విజయ్‌కుమార్, హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
 
ఎయిర్ బ్యాగులున్నప్పటికీ..
కారు అమర్చిన ఎయిర్‌బ్యాగ్‌లు తెరచుకున్నప్పటికీ వాహనం వేగానికి, ఢీకొట్టిన తీవ్రతకు పేలిపోయాయే తప్ప ముందు సీట్లో కూర్చున్న వారి ప్రాణాలు కాపాడలేకపోయాయి. ఈ సమయంలో వాహనాన్ని విజయవాడ రామవరప్పాడుకు చెందిన గోవర్థన్‌రావు నడుపుతున్నాడు. కారుముందు భాగం నుజ్జవడంతో అతడు సీట్లోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచాడు. మిగతావారి తల, ఛాతిపైన బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్త స్రావ మై మరణించారు.

పోలీసులు కూడా దీనినే ధ్రువీకరించారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అతికష్టం మీద బయటకు తీశారు. ఆరుగురూ రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు. ఇటీవల విజయవాడలో స్థలం విక్రయించినట్లు సమాచారం. దానికి సంబంధించి అడ్వాన్సు తీసుకునేందుకు విశాఖ బయలు దేరినట్టు తెలిసింది. మృతుల్లో ఒకరైన సుధాకర్ ఏపీ న్యూస్ పేరుతో న్యూస్‌చానల్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.

దీని ఏర్పాట్ల గురించి కూడా చర్చించేందుకు, అవసరమై స్థలాన్ని, వసతిని పరిశీలించేందుకు విశాఖ బయలుదేరినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన గుర్తింపుకార్డు ఒకటి మృతుని వద్ద లభించింది. వారివద్ద ఉన్న ఆధారాల మేరకు కుటంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.
 
లారీ కోసం గాలింపు...
ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్నవారు మరణించిన విషయాన్ని లారీ డ్రైవర్ గుర్తించాడు. వెంటనే లారీతో సహా వెళ్లిపోయాడని సమాచారం. లారీ ఆగిఉన్న సమయంలో వాహనం ఢీకొట్టిందా? లేక ప్రయాణిస్తూ సడన్ బ్రేక్‌వేయడం వల్ల ఢీకొట్టిందా? అన్నది నిర్ధారించుకోవడానికి పోలీసులు లారీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వేంపాడు టోల్‌గేట్‌లో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి లారీ ఆచూకీ కనుగొనేందుకు యత్నిస్తున్నారు.
 
రవిసుధాకర్ కుటుంబంలో విషాదం
ఇబ్రహీంపట్నం : విశాఖపట్నం వద్ద శని వారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇబ్రహీంపట్నం శక్తినగర్‌కి చెందిన నల్లమోతు రవిసుధాకర్(47) మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు  తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రవిసుధాకర్ గతంలో పలు దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయన రంగమ్మను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె శ్రీజ బీఫార్మసీ చేస్తోంది. కుమారుడు రాజు రామ్ ఇంటర్ చదువుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో రవిశంకర్ మృతిచెందినట్లు తెలియగానే కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు విశాఖ జిల్లాకు బయలుదేరి వెళ్లారు.
 
గోవర్ధనరావు కుటుంబంలో..
రామవరప్పాడు : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గరిమెళ్ల గోవర్థనరావు ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయం సమీప ప్రాంత వాసి.   గోవర్థనరావు మరో ఐదుగురు రియల్ ఎస్టేట్ పనిమీద శుక్రవారం రాత్రి కారులో విశాఖపట్నం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది  గోవర్థన్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడి తల్లిదండ్రులు అడవినెక్కలంలో నివాసం ఉంటున్నారు. ప్రమాదం గురించి తెలియగానే గోవర్థనరావు సమీప బంధువైన ప్రసాదంపాడు ఉప సర్పంచ్ కోమ్మా కోటేశ్వరరావు తదితరులు హుటాహుటిన విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.
 
ఫారుక్ పరిస్థితి విషమం
కారులో వీరితోపాటు ప్రయాణిస్తున్న యనమలకుదురు వాసి ఫారుక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఫారుక్ ఆటోనగర్‌లో బ్యాటరీల దుకాణం నిర్వహిస్తుంటాడు. అతడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు, బంధువులు విశాఖపట్నం బయలుదేరారు.

Advertisement
 
Advertisement