బెజవాడలో మళ్లీ నకిలీ కరెన్సీ కలకలం

Vijayawada Fake Currency People Arrested By Task Force Police - Sakshi

సాక్షి, విజయవాడ : బెజవాడలో మరోసారి నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. చిరు వ్యాపారులనే టార్గెట్‌గా చేసుకొని నకిలీ కరెన్సీ ముఠా దొంగనోట్లను ప్రజల్లోకి చలామణి చేస్తోంది. రెండు రోజుల క్రితం ఈ ముఠాలోని ఇద్దరిని  అదుపులోకి తీసుకుని మూడు లక్షల రూపాయల విలువ చేసే దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. దొంగనోట్ల  ముఠా కృష్ణా జిల్లా మచిలీపట్నం చిన్నాపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల  వ్యవధిలోనే దొంగనోట్ల ముఠాలోని మరో ఇద్దరిని  పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.13 లక్షల  ఇరవై ఎనిమిది వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 

వీటిలో వంద, ఐదు వందల, రెండు వేల రూపాయల నకిలీ నోట్లు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో నలుగురు ముఠా సభ్యులు  ఉన్నారు. అయితే అసలు ముఠా సూత్రధారుల కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. నకిలీ నోట్ల వ్యవహారంలో వ్యాపారులు జాగ్రత్తగా  ఉండాలని.. ఎవరిపైన అయినా అనుమానం వస్తే వెంటనే సమాచారం  ఇవ్వాలని టాస్క్ ఫోర్స్  అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్ సూచించారు. దొంగనోట్ల చలామణీని పూర్తిస్థాయిలో  అరికడతామని.. నకిలీ నోట్ల ముఠా కోసం నగరంలో ప్రత్యేక టీంలు  తిరుగుతున్నాయని ఆయన  వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top