
సాక్షి, విజయనగరం: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శోభా స్వాతి రాణి, గుళ్లిపల్లి గణేష్ దంపతులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. శోభా స్వాతి రాణి, గుళ్లిపల్లి గణేష్ దంపతులకు ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్ సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత తొమ్మిది నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలకు ఆకర్షితులై తాను వైఎస్సార్ సీపీలో చేరినట్లు శోభా స్వాతి రాణి తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడంతో పాటు పలు సంక్షేమ పధకాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయనగరం వైఎస్సార్ సీపీ నేత నెరత కాయల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.