వాల్తేరు డివిజన్‌ రద్దు యోచన తగదు | Vijay Sai Reddy Speech About Waltair Division In Parliament | Sakshi
Sakshi News home page

వాల్తేరు డివిజన్‌ రద్దు యోచన తగదు

Nov 21 2019 11:58 AM | Updated on Nov 21 2019 11:58 AM

Vijay Sai Reddy Speech About Waltair Division In Parliament - Sakshi

రాజ్య సభలో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం:  విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో భాగమైన వాల్తేరు డివిజన్‌ను యాథావిధిగా కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి  వి.విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో బుధవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న వాల్తేరు డివిజన్‌ భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న డివిజన్లలో అయిదో స్థానంలో ఉందన్నారు.   ఈస్టుకోస్టు రైల్వేలో వాల్తేరు డివిజన్‌ ఆదాయం తూర్పు తీర రైల్వేలోనే మూడో అత్యధిక ఆదాయ వనరుగా మారిందని చెప్పారు. గణనీయంగా ఎదుగుతున్న వాల్తేరు డివిజన్‌ను మరింత  ప్రోత్సహించాల్సింది పోయి.. వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లోని విజయవాడ డివిజన్‌ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. ఈ తప్పిదం అనేక సమస్యలకు, అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ఎక్కడో 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ డివిజన్‌లో వాల్తేరు డివిజన్‌ను విలీనం చేయాలన్న ఆలోచన రైల్వే నిర్వహణ, విపత్తు యాజమాన్యానికి సంబంధించి అనేక సమస్యలకు దారి తీస్తుంది.. ప్రమాదాల సమయంలో త్వరగా స్పందించే సామర్థ ్యం తగ్గిపోయే అవకాశం ఉంది..  ప్రయాణికుల భద్రత, రైల్వే నిర్వహణ వంటి సున్నితమైన అంశాల నుంచి దృష్టి మరలే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విశాఖలో ఇప్పటికే పూర్తి స్థాయి డివిజన్‌ వ్యవస్థ పనిచేస్తోంది.. కార్గో టెర్మినల్స్, లోకో షెడ్, వ్యాగన్‌ వర్కుషాపుతోపాటు 2300 మంది సిబ్బందికి సరిపడా స్టాఫ్‌ క్వార్టర్లు ఉన్నాయి.. వాల్తేరు డివిజన్‌ను కొనసాగించడం వల్ల రైల్వేలపై అదనపు భారం ఏదీ ఉండదని వివరించారు. కాని వాల్తేరు డివిజన్‌ను తరలించడం వల్ల మౌలిక వసతుల ఏర్పాటు కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుందన్నారు. ఒక డివిజన్‌ను రద్దు చేయడం   రైల్వే చరిత్రలోనే లేదని, అలాంటిది 125 సంవత్సరాల చర్రిత కలిగిన వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయాలని రైల్వే యాజమాన్యం భావిస్తే అది  పెద్ద తప్పిందం అవుతుందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలను దెబ్బతిసినట్టు అవుతుందన్నారు. ఈ అంశాలను దృష్టికి ఉంచుకొని వాల్తేరు డివిజన్‌ను యాథావిధిగా కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement