
మద్యంపై వ్యాట్ ఆదాయం అదుర్స్
మద్యం విక్రయాలపై వ్యాట్ సర్కారుకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వం నిర్ధారించిన లక్ష్యానికి మించి వ్యాట్ ఆదాయం వస్తోంది.
డిసెంబర్‌లో లక్ష్యం రూ.950 కోట్లు.. రాబడి రూ.1,260 కోట్లు
మిగతా రంగాల్లో మాత్రం లక్ష్యాలను సాధించలేమంటూ వాణిజ్య పన్నుల అధికారుల మొర
సాక్షి, హైదరాబాద్: మద్యం విక్రయాలపై వ్యాట్ సర్కారుకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వం నిర్ధారించిన లక్ష్యానికి మించి వ్యాట్ ఆదాయం వస్తోంది. డిసెంబర్ నెలనే తీసుకుంటే మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా రూ.950 కోట్లను ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించగా.. ఆదాయం రూ.1260 కోట్లు వచ్చింది. మిగతా రంగాలపై వ్యాట్ ఆదాయం మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా రావడం లేదు. ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ శనివారం దీనిపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నాటికి వ్యాట్ ద్వారా రూ. 40 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించగా రూ.36 వేల కోట్లు మాత్రమే వచ్చింది.
దీనిపై టక్కర్ సర్కిల్స్ వారీగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులను నిలదీశారు. వ్యాట్ ఆదాయం తగ్గడానికి కారణాలేమిటో చెప్పాలని, ఉద్యోగులెవరైనా వ్యాట్ వసూళ్లను సరిగా చేయడం లేదంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. దీనిపై ఆ శాఖ అధికారులు స్పందిస్తూ గత ఆర్థిక సంవత్సరం వాస్తవంగా వచ్చిన ఆదాయం ఆధారంగా ఆర్థిక శాఖ లక్ష్యాన్ని నిర్ధారించకుండా.. గత లక్ష్యానికి పాతిక శాతం ఎక్కువ లక్ష్యాన్ని నిర్ధారిస్తోందని, దీని వల్ల లక్ష్యాలను సాధించలేకపోతున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ఆదాయం 53 వేల కోట్ల రూపాయల లక్ష్యానికి గాను 50 వేల కోట్ల రూపాయలే సాధించగలమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్పష్టం చేశారు.