చంద్రన్న శఠగోపం

Unemployee Youth Protest On Unemployment benefit Chittoor - Sakshi

నిరుద్యోగ భృతిపై ఆంక్షలతో దగా

రాష్ట్రవ్యాప్తంగా భృతికి అర్హులు 10 లక్షల మందేనట

జిల్లాలో 2.50 లక్షల మంది నిరుద్యోగులు

ప్రభుత్వ ఆంక్షలతో కేవలం 40 నుంచి 50 వేల మందికే లబ్ధి

తీవ్ర ఆవేదనకు గురౌతున్న యువత

రూ.2 వేలు కాదు.. వెయ్యికే కుదింపు

ఉద్యమమిస్తామంటున్న విపక్షాలు, నిరుద్యోగులు

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: తాము అధికారంలోకి వస్తే.. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి రూ.2 వేల చొప్పున ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారు. తనదైనశైలిలో నిరుద్యోగులకు శఠగోపం పెట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కనీస చర్యలు చేపట్టకుం డా ఎన్నికల ఏడాదిలో నామమాత్రపు  భృతిని ప్రకటించారు. పైగా సవాలక్ష ఆంక్షలు పెట్టి.. నిరుద్యోగులను నట్టేట ముంటే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల మంది నిరుద్యోగులకు గాను.. కేవలం 50 వేల మందికే భృతి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏటా పెరుగుతున్న నిరుద్యోగులు..
కమలనాథన్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం 217 నాటికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వడకుండా విద్యావంతులతో ప్రభుత్వం ఆడుకుంటోంది. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 35 నుంచి 40 లక్షల వరకు ఉంది. జిల్లావ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసిన వారు 75 వేలు, పీజీ చేసిన వారు 28 వేలు, బీటెక్‌ –40 వేలు, పీహెచ్‌డీ–9 వేలు, ఎంఈడీ, బీఈడీ, డీఎడ్‌ పూర్తి చేసిన వారి సంఖ్య 68,200 మంది ఉన్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ వర్గాల అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతి ఏపాటిదో అర్థం అవుతోంది.

ఎస్వీయూలో విద్యార్థి విభాగం నిరసన
యూనివర్సిటీ క్యాంపస్‌: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పేరిట నిరుద్యోగులను వంచనకు గురి చేస్తోందని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు ఆరోపించారు. శుక్రవారం గాంధీ విగ్రహం ఎదుట వారు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 2 వేల రూపాయల భృతి ఇస్తామని చెప్పి, నాలుగు సంవత్సరాలుగా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ భృతి ఇస్తామని చెపుతున్నారన్నారు. ఈ నిరసనలో తిరుపతి పార్లమెంటరీ నియోజవవర్గ అధ్యక్షుడు సుధీర్, రాజంపేట నియోజక వర్గ అధ్యక్షుడు కిషోర్‌ దాస్, ఇతర నాయకులు నరేంద్ర, సుధాకర్, ప్రసాద్, రమణ, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

కోత ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు పదిలక్షలమంది మాత్రమే..
వయోపరిమితి 22 నుంచి 35 సంవత్సరాల వరకు కుదింపు
ఇంట్లో ఒక్క నిరుద్యోగికి మాత్రమే భృతి
ప్రభుత్వ పరంగా ఆ వ్యక్తి ఎటువంటి లబ్ధి పొంది ఉండకూడదు
ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ ఉండకూడదునిరుద్యోగ భృతి రూ.2 వేల నుంచి రూ.1000కి కుదింపు ప్రభుత్వ సాధికారత సర్వేలో నమోదై ఉండాలి
రేషన్‌కార్డు, ఓటరు కార్డుతో పాటు వ్యక్తి స్థానికుడై ఉండాలి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top