కొత్తగా రెండు టెస్టింగ్‌ ల్యాబ్‌లు

Two new testing labs for Coronavirus in AP - Sakshi

వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం పది టెస్టింగ్‌ ల్యాబొరేటరీలు అందుబాటులోకి వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి వెల్లడించారు. విజయవాడలో శుక్రవారం ఆయన సమాచార శాఖ కమిషనర్‌ టి. విజయ కుమార్‌ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు టెస్టుల పరంగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని, 1,02,460 టెస్టులు చేశామని, అన్ని రాష్ట్రాల్లో కలిపి 9 లక్షల టెస్టులే నిర్వహించారని వివరించారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దేశ జనాభాలో రాష్ట్ర జానాభా 4 శాతం కంటే తక్కువ. టెస్టుల పరంగా అత్యధికంగా 12 శాతం టెస్టులు మన రాష్ట్రంలోనే నిర్వహించామని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

► శుక్రవారం వచ్చిన 60 పాజిటివ్‌ కేసుల్లో 57 పాత క్లస్టర్లలోనే వచ్చాయి. 3 కేసులు కొత్త క్లస్టర్లలో ఉన్నాయి. 
► రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
► కొత్తగా శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. దీంతో మొత్తం 10 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి.
► నెల్లూరులో ల్యాబ్‌ ఏర్పాటుకు  ప్రయత్నిస్తున్నాం.
► పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాల యాజమాన్యాలను సంప్రదిస్తున్నాం. 
► విశాఖపట్నం, విజయవాడలో ఉన్న హెచ్‌ఐవి వైరల్‌ లోడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను కోవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లుగా మార్చేందుకు అనుమతి వచ్చింది. వీటిలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తులకు టెస్టులు నిర్వహిస్తాం.
► రాష్ట్రంలో మరో 5 సబినాట్‌ టెస్టింగ్‌ మిషన్లతో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి వచ్చింది.
► రూ. కోటితో డీఆర్‌డీఓ, స్విమ్స్‌ సౌజన్యంతో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో అంగీకారం కుదిరింది. ఈ ల్యాబ్‌ రీసెర్చ్‌కు కూడా ఉపయోగపడుతుంది. 
► అన్ని జిల్లాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం వల్ల టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
► గుజరాత్‌ నుండి వచ్చిన సుమారు 6 వేల మంది మత్స్యకారులకు పూల్డ్‌ శాంపిల్‌ టెస్టింగ్‌ విధానం ద్వారా పరీక్షలు నిర్వహిస్తాం. నెగెటివ్‌గా నిర్థారించుకున్న వారిని మాత్రమే స్వస్థలాలకు పంపేందుకు కలెక్టర్లు ఏర్పాటు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top