పెరగనున్న ఉపాధి, ఉద్యోగావకాశాలు

Two More Cement Factories Establishing In Kurnool - Sakshi

‘వైఎస్సార్‌ నవోదయం’తో జిల్లాలోని అనేక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ( ఎంఎంఎస్‌ఈ) ఊపిరి పోసుకోనున్నాయి. కంపెనీలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు రుణాల రీ షెడ్యూల్‌కు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో పలు కంపెనీలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోంది. ఇప్పటికే పలు సిమెంట్‌ కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించగా, రాంకో కంపెనీ పనులు వేగంగా జరుగుతున్నాయి. అల్ట్రాటెక్, ప్రిజమ్‌    కంపెనీలు వస్తుండటంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. 

సాక్షి, కర్నూలు(అర్బన్‌): జిల్లాలో మరో రెండు సిమెంట్‌ కంపెనీలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ, ప్రియా, జయజ్యోతి సిమెంట్‌ కంపెనీలు తమ ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామం సమీపంలో ఇప్పటికే రూ.1,500 కోట్ల పెట్టుబడితో రాంకో సిమెంట్‌ కంపెనీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ కంపెనీ ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2018 డిసెంబర్‌లో ఈ కంపెనీ పనులకు శంకుస్థాపన చేసినా, ఈ ఏడాది జూన్‌ నుంచే పనులు ఊపందుకున్నాయి. 2020 మార్చి, ఏప్రిల్‌ నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే మరో రెండు సిమెంట్‌ కంపెనీలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రూ.2వేల కోట్లతో దాదాపు 1850 మందికి ఉపాధి కల్పించే దిశగా అల్ట్రాటెక్, రూ.4వేల కోట్ల పెట్టుబడితో ప్రిజమ్‌ కంపెనీలు సన్నాహాలు ప్రారంభించనట్లు సమాచారం. ప్రిజమ్‌ ద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ మూడు సిమెంట్‌ కంపెనీలు జిల్లాలో ఉత్పత్తి ప్రారంభిస్తే వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  

వైఎస్సార్‌ నవోదయంతో ఎంఎస్‌ఎంఈలకు ఊపిరి
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ నవోదయం’ కార్యక్రమంతో జిల్లాలోని అనేక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎంఎస్‌ఈ ) ఊపిరి పోసుకోనున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు రూ.10 లక్షల పెట్టుబడితో 6,017 ఎంఎస్‌ఎంఈలు ఉండగా, వీటిలో 2,628 రీస్ట్రక్చరయ్యాయి. అలాగే రూ.10 లక్షలకు పైగా పెట్టుబడితో 201 ఎంఎస్‌ఎఈలుండగా, ఇందులో 20 మాత్రమే రీస్ట్రక్చరయ్యాయి. ఆయా ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు బ్యాంకు రుణాలను రీషెడ్యూల్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున పలు ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది. ఆర్థిక వెసులుబాటు కలిగితే తిరిగి ఆయా ఎంఎస్‌ఎంఈలు పునర్జీవం పొందడమే గాక, ఉత్పత్తులు ప్రారంభించే అవకాశాలున్నాయి. దీంతో కార్మికులకు ఉపాధితో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్‌ వల్ల మరి కొన్ని రంగాలకు లబ్ధి చేకూరే అవకాశముంది.  

కొత్త సిమెంట్‌ పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి 
జిల్లాకు కొత్తగా రెండు సిమెంట్‌ పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి. అల్ట్రాటెక్, ప్రిజమ్‌ కంపెనీల ప్రతినిధులు ఇటీవల సీఎంను కలిశారు. రాంకో సిమెంట్‌ పరిశ్రమ ప్రారంభమైతే చాలా మందికి ఉపాధి లభిస్తుంది. వైఎస్సార్‌ నవోదయం పథకం ద్వారా జిల్లాలో అనేక ఎంఎస్‌ఎంఈలు పునర్జీవం పొందనున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానం అందుబాటులో ఉంది. ఔత్సాహికులు  సింగిల్‌ డెస్క్‌ విధానంలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు, అనుమతులు పొందొచ్చు.  
– జీ సోమశేఖర్‌రెడ్డి, డీఐసీ జీఎం   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top