కడలి కబళించింది

Two Girls Dead In Sea bathing PSR Nellore - Sakshi

 తూపిలిపాళెం బీచ్‌లో ఇద్దరు బాలికల దుర్మరణం

కూలీల ఇంట విషాదం

నెల్లూరు, వాకాడు/కోట: రెక్కాడితే గానీ.. డొక్కాడని నిరుపేద కూలీ కుటుంబాల్లో సముద్ర స్నానం విషాదం నింపింది. అలల రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరు బాలికలను కబళించింది. వాకాడు మండలం తూపిలిపాళెం బీచ్‌కు వెళ్లిన సిద్ధపురెడ్డి రమ్య (15), గంధళ్ల రోషిణి (16) కెరటాల తాకిడికి కొట్టుకుపోయి మరణించారు. అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్రకు బయలుదేరిన ఇంటి పెద్దలు క్షేమంగా తిరిగి రావాలనే ఆకాంక్షతో పూజ తలపెట్టిన ఆ ఇద్దరు బాలికలు మరో 10 మందితో కలిసి సముద్రంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎగసిపడుతున్న అలలు ఆ బాలికల్ని పొట్టనపెట్టుకున్నాయి. ఈ ఘటనతో వారి స్వగ్రామమైన కోట మండలం వీరారెడ్డిసత్రం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలికల మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇంటిపెద్దల క్షేమం కోరి..
మృతి చెందిన సిద్ధపురెడ్డి రమ్య తండ్రి పాపయ్య, తల్లి వెంకటలక్ష్మి, గంధళ్ల రోషిణి తండ్రి శ్రీనివాసులు, తల్లి పాపమ్మ గిరిజన కుటుంబాలకు చెందిన వారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. పాపయ్య, శ్రీనివాసులు సమీప బంధువులు. గిరిజన కాలనీకి చెందిన మరో ఇద్దరితో కలిసి వారిద్దరూ అయ్యప్ప మాల ధరించారు. శబరిమల యాత్రకు బుధవారం బస్సులో తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో వాళ్ల ఇంటికి బంధుమిత్రులు తరలి రావడంతో సందడి నెలకొంది. శబరిమల యాత్రకు వెళ్లిన వారు తిరిగి వచ్చేవరకు ఇంట్లోని అయ్యప్ప స్వామి పీఠం వద్ద ఎవరో ఒకరు నిష్టతో పూజ, దీపారాధన చేయడం సంప్రదాయం. ఆ సంప్రదాయం నిర్వర్తించే బాధ్యతను పాపయ్య కుమార్తె రమ్య, శ్రీనివాసులు కుమార్తె రోషిణి చేపట్టారు. రమ్య 9వ తరగతి చదువుతుండగా, రోషిణి చిట్టేడులోని రొయ్యల కంపెనీలో పనిచేస్తోంది. పీఠం వద్ద పూజలు చేయడానికి ముందు సముద్రంలో పవిత్ర స్నానం ఆచరించాలన్న ఉద్దేశంతో బాలికలు రమ్య, రోషిణి తమ బంధుమిత్రులైన నవీన్, కోటేశ్వరరావు, రవి, రాధ, జ్యోతి, సుగుణ, ప్రశాంతి, అనిత, ఈశ్వరమ్మ, పవన్‌తో కలసి గురువారం ఉదయం రెండు ఆటోల్లో బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లోని మొదటి ఘాట్‌లో కాకుండా ఎత్తిపోతల జెట్టీ వద్దకు చేరుకుని స్నానానికి ఉపక్రమించారు.
సముద్రం నుంచి బయటకు తీసిన రమ్య మృతదేహం , రోషిణి మృతదేహం వద్ద విలపిస్తున్న మృతురాలి అక్క
అక్కడ కెరటాల ఉధృతితోపాటు లోతు అధికంగా ఉంటుంది. దానికితోడు అల్పపీడనం వల్ల సముద్రం అల్లకల్లోంగా మారి అలలు ఎగిసిపడ్డాయి. రమ్య, రోషిణి అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. కంగారుపడిన తోటివారంతా ఒడ్డుకు చేరుకున్నారు. రమ్య మృతదేహాన్ని వెతికి పట్టుకోగా.. రోషిణి ఆచూకీ లభ్యం కాలేదు. ఆ సమయంలో తూపిలిపాళెంలోనే ఉన్న ఏఎంసీ ఛైర్మన్‌ పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి చైతన్య జ్యోతి వెల్ఫేర్‌ సొసైటీ సిబ్బంది, మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. గంట సేపటి తరువాత రోషిణి మృతదేహం లభించింది. రెండు మృతదేహాలను కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్దలు క్షేమంగా తిరిగి రావాలనే ఉద్దేశంతో పవిత్ర స్నానానికి వెళ్లిన ఇద్దరూ విగత జీవులై తిరిగి రావడంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. యాత్రలో భాగంగా తమిళనాడులోని శ్రీరంగపట్నం వరకు చేరుకున్న రమ్య తండ్రి పాపయ్య, రోషిణి తండ్రి శ్రీనివాసులు ఈ విషయం తెలిసి అక్కడికక్కడే దీక్షను త్యజించి తిరుగు ప్రయాణమయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top