ఇద్దరు ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల అరెస్ట్ | Two Directors of NCS Sugar Factory arrest | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల అరెస్ట్

Sep 7 2014 1:32 PM | Updated on Sep 2 2017 1:01 PM

రహదారులను దిగ్బంధనం చేసిన రైతులు-పోలీస్ బందోబస్తు

రహదారులను దిగ్బంధనం చేసిన రైతులు-పోలీస్ బందోబస్తు

జిల్లాలోని చెరుకు రైతుల తిరుగుబాటు ఫలించింది. సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, మురళీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయనగరం: జిల్లాలోని చెరుకు రైతుల తిరుగుబాటు ఫలించింది. సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, మురళీలను పోలీసులు అరెస్ట్ చేశారు. బకాయిలు చెల్లించాలని చెరుకు రైతులు వారం రోజులుగా రోడ్డు ఎక్కారు. నిన్న మండలంలోని రోడ్లను దిగ్బంధనం చేశారు.  ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ  యాజమాన్యం 11వేల మంది చెరుకు రైతులకు 24 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించవలసి ఉంది. ఇదుగో ఇస్తాం, అదుగో ఇస్తాం అని చెబుతూ యాజమాన్యం 18 సార్లు వాయిదా వేసింది.

దాంతో రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. వారం రోజుల నుంచి ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారంలో రైతులు షుగర్ ఫ్యాక్టరీ లోపలకు చొచ్చుకుపోయారు. లోపల యంత్రాలను, అద్దాలను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ ఆవరణలోని చెట్లను కూడా పెకలించివేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా  తమను బాధలకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమసొమ్ముతో  వ్యాపారం చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు. అప్పులు చేసి చెరకు పండించి ఫ్యాక్టరీకి సరఫరా చేశామని చెప్పారు. ఏడాదిన్నర నుంచి  తమకు రావాల్సిన సొమ్మును ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని వారు వాపోయారు. అధికారులు, పాలకులు కూడా తమను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో చెరుకు రైతుల ఆందోళనపై పోలీసులు స్పందించారు. ఫ్యాక్టరీ ఇద్దరు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు.

ఎన్‌సీఎస్ సుగర్స్ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులను వేలం వేసి రైతులకు బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నాలుగు రోజుల క్రితం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి చెప్పారు. లచ్చయ్యపేటలోని భూముల రికార్డులను అనుసరించి గురువారం సర్వే నిర్వహించారు. షుగర్స్‌కు చెందిన 75.11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని చెరుకు రైతుల బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
**

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement