
సాక్షి, అమరావతి: ఆటోల నుంచి రోడ్ ట్యాక్స్‌ను, ఫిట్‌నెస్ ఫీజు జాప్యానికి అపరాధ రుసుమును ముక్కు పిండి వసూలు చేసే రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్‌కు మాత్రం మినహాయింపునిస్తోంది. ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పుతూ రోడ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నా చేష్టలుడిగి చూస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల్లో చాలామంది అధికార పార్టీకి చెందిన వారే కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పుతూ ట్రావెల్స్ నిర్వాహకులు రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు.
రాష్ట్రంలో 491 ప్రైవేట్ బస్సులు కాంట్రాక్టు క్యారేజీ కింద అనుమతి పొందగా, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు మరో 750 వరకు ఉన్నాయి. సాధారణంగా ప్రతి ప్రైవేట్ బస్సు ప్రతి మూడు నెలలకోసారి విధిగా త్రైమాసిక పన్ను చెల్లించాలి. సీటుకు రూ.3,750 చొప్పున చెల్లించాలి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులతో కలిపి ఏటా రూ.50 కోట్ల వరకు రోడ్ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా, రూ.25 కోట్లే వసూలవుతున్నట్లు రవాణా వర్గాలు పేర్కొనడం గమనార్హం.
ఆన్‌లైన్‌పై విముఖత
అధికార పార్టీకి చెందిన ట్రావెల్స్ నిర్వాహకులు ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పుతుండడంతో రోడ్ ట్యాక్స్ ఆదాయానికి గండి పడుతోంది. ఉదాహరణకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక పర్మిట్‌తో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరితే, రెండో బస్సు అదే పర్మిట్ నంబరుతో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరుతుంది. రవాణా శాఖ ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆన్‌లైన్‌లోనే రోడ్ ట్యాక్స్ చెల్లించవచ్చు. ఈ విధానంలో పన్ను చెల్లిస్తే.. ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పడం కష్టం. దీంతో ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టపడడం లేదు.