27 నుంచి టీటీడీ ‘శుభప్రదం’

TTD Subhapradam From May 27 - Sakshi

7, 8, 9 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులకు ప్రవేశం

తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మందికి అవకాశం

తిరుపతిలో 7 కేంద్రాలలో ఏర్పాట్లు

సాక్షి, తిరుపతి: భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ, నైతిక విలువలపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతి ఏడాదీ వేసవిలో ‘శుభప్రదం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27 నుండి జూన్‌ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 2012 నుండి నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వరుని జీవిత చరిత్ర, భగవద్గీత, సనాతనధర్మ పరిచయం, రామాయణ, భారత, భాగవత సందేశం, ఆర్ష వాజ్మయం, వ్యక్తిత్వ వికాసం, భారతీయ కుటుంబ జీవనం, పండుగలు–పరమార్థాలు, ఆచారాలు–వైజ్ఞానిక దృక్పథం, మాతృ భాష, విద్య, దేశభక్తి తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశం
తిరుపతి కేంద్రంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 7, 8, 9 తరగతులకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం 3,500 మందికి ఈ అవకాశం దక్కుతుంది, విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరు శిక్షణా తరగతులు ఉంటాయి.ధర్మప్రచార పరిషత్‌ ప్రోగ్రాం అసిస్టెంట్, జిల్లా ధర్మప్రచార మండలి సభ్యుల కార్యాలయాలు, టీటీడీ కల్యాణ మండపాలతోపాటు టీటీడీ వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను తిరిగి ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రోగ్రాం అసిస్టెంట్లకు సమర్పించాల్సి ఉంటుంది. తిరుపతిలోని విద్యార్థులు స్థానిక అన్నమాచార్య కళామందిరంలోని ధర్మప్రచార పరిషత్‌ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ వద్ద దరఖాస్తులు పొంది తిరిగి అక్కడే సమర్పించవచ్చు.

ఏడు శిక్షణ కేంద్రాలు
తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలైన ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌పీడబ్ల్యు డిగ్రీ కళాశాల, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్వీ జూనియర్‌ కళాశాల, ఎస్‌పీడబ్లు్య జూనియర్‌ కళాశాల, ఓరియంటల్‌ కళాశాల, ఎస్‌పీడబ్ల్యు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు మెటీరియల్, నిష్ణాతులతో బోధనతోపాటు భోజన వసతి, బస కల్పిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top