శ్రీవారి దర్శనార్థం టీటీడీ ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌ను మంగళవారం నుంచి 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు.
తిరుపతి అర్బన్: శ్రీవారి దర్శనార్థం టీటీడీ ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌ను మంగళవారం నుంచి 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో ఆన్‌లైన్ సేవలు-మరింత పారదర్శకతకు చర్యలు’ అనే అంశంపై సోమవారం ఆయన సీనియర్ విభాగాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు మరింత పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు. అందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను జూన్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి తేవాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు మంజూరుకాని భక్తులకు నగదును మూడురోజుల్లో వాపసు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆన్‌లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 24 గంటలూ పొందేందుకు ఒక కుటుంబానికి 6 టికెట్లు మాత్రమే కేటాయించ నున్నట్లు తెలిపారు. గతంలో ఈ విధానం ద్వారా టికెట్లు పొందాలంటే కుటుంబంలోని అందరి ఫొటో, ఐడీ ప్రూఫ్‌లను అప్‌లోడ్ చేయాల్సి వచ్చేదన్నారు. ఇకపై గ్రూపులోని ముఖ్యవ్యక్తి మాత్రమే ఫొటో, ఐడీ ప్రూఫ్‌లను అప్‌లోడ్ చేసి, మిగిలిన వారివి ఐడీ ప్రూఫ్‌లు మాత్రం అప్‌లోడ్ చేస్తే సరిపోతుందని చెప్పారు. రోజూ అడ్వాన్స్ దర్శన టికెట్లు పొందిన భక్తుల పేర్లు, వివరాలను జూన్ ఒకటి నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశించారు.