పచ్చపార్టీ నాయకులు పంట పొలాలుగా మార్చిన ఉప్పుటూరు – పోతుకట్ల వాగు ప్రాంతం
రూ.122 కోట్ల వాగు భూమి మాయం
టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి అండతో సుమారు 61 ఎకరాలు దురాక్రమణ
బాపట్ల జిల్లాలో ఉప్పుటూరు – పోతుకట్ల వాగు కబ్జా
సాగు భూములుగా మార్చుకున్న కబ్జాదారులు
వాగు అదృశ్యంతో బ్రిడ్జిలు లేకుండానే వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణం
దీంతో మోంథా తుపాను సమయంలో పోటెత్తిన వరద
నీరు వెళ్లే దారిలేక పర్చూరు, నాగులపాలెం జలదిగ్బంధం
వేల ఎకరాల్లో వరి నీట మునగడంతో అన్నదాతలకు అపార నష్టం
ఆక్రమణలు తొలగించి వాగును పునరుద్ధరించాలని డిమాండ్
పచ్చ ముఠాల భూ దాహానికి ఓ వాగు పూర్తిగా మాయం కాగా సుమారు రూ.120 కోట్ల విలువ చేసే స్థలం ఆక్రమణల పాలైంది. కబ్జా చేసిన స్థలాన్ని సాగు భూములుగా మార్చేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో మోంథా తుపాను సమయంలో దురాక్రమణ ఫలితం తెలిసివచ్చింది. వాగు ఆక్రమణతో పలు గ్రామాలు, వేలాది ఎకరాల పంట పొలాలు ముంపు బారిన చిక్కుకుని అపారనష్టం వాటిల్లింది.
జాతీయ రహదారికి గండ్లు కొట్టించి తాత్కాలికంగా ముంపు ముప్పును తప్పించిన కలెక్టర్ ఆ తర్వాత మళ్లీ ఆక్రమణల జోలికెళ్లలేదు. కబ్జాదారులంతా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనుచరులు కావడంతోనే ఉన్నతాధికారులు వెనుకడుగు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఉప్పుటూరు – పోతుకట్ల వాగు కబ్జా వ్యవహారం ఇది.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇసుక నుంచి గనుల దాకా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న పచ్చముఠాలు వాగులు వంకలను సైతం వదలడం లేదు! బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంతంలో ఏకంగా ఉప్పుటూరు – పోతుకట్ల వాగును కబ్జా చేశారు. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అండదండలతో ఉప్పుటూరు గ్రామ సర్వేనంబర్ 13 నుంచి ఉప్పుటూరు వరకు 300 అడుగుల వెడల్పు ఉండే వాగును 2 కి.మీ. పొడవున పూడ్చి చదును చేశారు.
వాగు పరిధిలో సర్వే నంబర్లు 8, 12, 13, 13–1, 13 – 4, 13–6, 21–3, 30–1లలో 41 ఎకరాలతోపాటు సమీపంలోనే ఉన్న మరో 20 ఎకరాలు కలిపి సుమారు 61 ఎకరాల వాగు ప్రాంతాన్ని సాగు భూమిగా మార్చి వరి, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్నారు. వాడరేవు– పిడుగురాళ్ల జాతీయ రహదారి ఈ వాగుమీదుగా వెళ్లడంతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి.
గతంలో రూ.10 లక్షలు ఉన్న ఎకరం ఇప్పుడు రూ.2 కోట్లు పలుకుతోంది. 60 ఎకరాలకు పైగా ఉన్న ఆక్రమిత భూముల విలువ సుమారు రూ.120 కోట్లు పైమాటే. వాగును పరిరక్షించాల్సిన డ్రైనేజీ, రెవెన్యూ అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని చారిత్రక వాగును పచ్చనేతలకు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. కబ్జాదారులంతా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనుచరులు కావడంతో ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
మోంథా ముంచేయడంతో..
గత ఏడాది వచ్చిన మోంథా తుపాను ఉప్పుటూరు వాగు కబ్జా వ్యవహారాన్ని బయటపెట్టింది. వాగు కబ్జాకు గురికావడంతో వరదనీరు పర్చూరు, నాగులపాలెం గ్రామాలను చుట్టుముట్టింది. అప్రమత్తమైన కలెక్టర్ వినోద్ కుమార్ పర్చూరు ప్రాంతం మ్యాపును పరిశీలించగా వాగు భౌతికంగా కనిపించలేదు. దీంతో మ్యాపులో చూపించిన ప్రకారం రెండు చోట్ల జాతీయ రహదారికి పెద్ద గండ్లు కొట్టించడంతో గ్రామాలకు వరద ముప్పు తప్పింది.
అయితే ఉప్పుటూరు, వీరన్నపాలెం, పోతుకట్లతోపాటు కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో 50 వేల ఎకరాల మేర వరి పంట నీట మునిగిపోయింది. పది రోజులపాటు నీటిలోనే ఉన్న వరి కుళ్లిపోవడంతో రైతులు రూ.వందల కోట్ల మేర నష్టపోయారు. ఈ ఉపద్రవానికి ఉప్పుటూరు – పోతుకట్ల వాగు కబ్జానే కారణమని గుర్తించినప్పటికీ ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
భూసేకరణలోనూ దాచిపెట్టి..
ఉప్పుటూరు వాగును అధికార పార్టీ నేతలకు అప్పగించిన అధికారులు దానిని కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పిదం చేశారు. వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణ సమయంలో పర్చూరు ప్రాంతంలో ఉప్పుటూరు – పోతుకట్ల వాగు ఉన్న విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా చేశారు. భూసేకరణలోనూ దీన్ని దాచి పెట్టారు. దీంతో వాగు ఉన్న ప్రాంతంలో బ్రిడ్జిలు, కల్వర్టులు లేకుండానే రహదారిని నిరి్మంచారు. ఫలితంగా వరద ప్రవాహం గ్రామాలతోపాటు వేల ఎకరాల్లో పంట పొలాలను ముంచెత్తింది.
ఏలూరి ఒత్తిడితో కలెక్టర్ వెనుకడుగు?
శతాబ్దాలుగా సహజసిద్ధంగా ప్రవహిస్తున్న ఉప్పుటూరు – పోతుకట్ల వాగు కబ్జాకు గురైన ప్రాంతాన్ని కలెక్టర్ గుర్తించినప్పటికీ కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. తుపాను సమయంలో పర్చూరు వద్ద జాతీయ రహదారికి గండి కొట్టిన ప్రాంతంలో వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్ ఆదేశించగా, సదరు నిర్మాణ సంస్థ చిన్నపాటి కల్వర్టులు నిర్మించి చేతులు దులిపేసుకుంది. దీంతో వరదనీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. భవిష్యత్‌లోనూ ముంపు ముప్పు పొంచి ఉంది.
జాతీయ రహదారి ప్రాంతంలో ఆక్రమణల్ని తొలగించి వాగును పునరుద్ధరించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారని భావించినా ఆయన మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఒత్తిళ్లతోనే కలెక్టర్ వెనక్కి తగ్గినట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. రహదారి నిర్మాణ సమయంలో కబ్జాదారులు అడ్డు తగలడంతో జాతీయ రహదారుల సంస్థ బ్రిడ్జిలను నిరి్మంచలేదని డ్రైనేజీ విభాగం డివిజినల్ అధికారి మల్లిఖార్జునరావు చెబుతుండగా.. పర్చూరు తహసీల్దారు బ్రహ్మయ్యను ఆక్రమణల విషయమై స్పందన కోరేందుకు ప్రయతి్నంచినా అందుబాటులోకి రాలేదు.


