అష్టబంధన ద్రవ్యాల సేకరణ

TTD Maha Samprokshanam Ashta Bandhana - Sakshi

యాగశాలలో వైదిక కార్యక్రమాల నిర్వహణ

మంగళవారం అష్టబంధనం సమర్పణ

సాక్షి, తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పన్నెండేళ్లకో సారి గర్భాలయంలోని మూలమూర్తి పటిష్టత కోసం విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా దృఢంగా ఉండేందుకు నిర్వహించే మహాసంప్రోక్షణలో భాగంగా సోమవారం రుత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం ద్రవ్యాలను సేకరించారు. ఉ.6 నుంచి మ.12 వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 10  వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారుచేస్తారు. మంగళవారం ఉదయం శ్రీవారి మూలమూర్తితోపాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పిస్తారు.
 
అష్టబంధనానికి ద్రవ్యాల మోతాదు ఇలా..
8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. వీటిలో శంఖచూర్ణం 25.5 తులాలు, మధుజ (తేనె మైనం) 3.5 తులాలు, లాక్షా(లక్క) 3.75 తులాలు, గుగ్గులు(వృక్షపు బంక) 9 తులాలు, కార్పాసం(ఎర్ర పత్తి) 1 తులం, త్రిఫలం(ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ) 7.5 తులాలు, రక్తశిలా చూర్ణము(గైరికము)7.5 తులాలు, మాహిష నవనీతము(గేదె వెన్న) 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.  

ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత..
శంఖ చూర్ణంతో చంద్రుడిని, తేనె మైనంతో రోహిణీ, లక్కతో అగ్ని, గుగ్గులుతో చండ, ఎర్ర పత్తితో వాయువును, త్రిఫల చూర్ణంతో హరిని, గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని ఆరాధిస్తారు. ముందుగా ఈ ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి 30 నిమిషాలపాటు బాగా దంచుతారు. అది పాకంగా మారుతుంది. ఇది చల్లబడిన తరువాత ముద్దగా చేసుకోవాలి. దీనిని గంటకు ఒకసారి చొప్పున 8 సార్లు కావలసినంత వెన్నను చేరుస్తూ దంచాలి. ఈ విధంగా వచ్చిన పాకాన్ని ముద్దలుగా తయారుచేస్తారు. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కల తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం క్యూలైన్‌లో ఉన్న భక్తులతో జేఈవో శ్రీనివాసరాజు ముచ్చటించారు. దర్శనానికి పడుతున్న సమయం, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, మంగళవారం సుమారు 20వేల మందికి స్వామివారి దర్శనం లభించే అవకాశం ఉంది.

 

నేటి కార్యక్రమాలు..

  • కుంభంలో వున్న శ్రీవారికి యాగశాలలో ఉదయోత్సవాలు నిర్వహిస్తారు.
  • ఉదయం 6 గంటల నుంచి విశేష హోమాలు నిర్వహిస్తారు.
  • హోమాలు నిర్వహించే సమయంలోనే ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధన ద్రవ్యం తయారుచేస్తారు.
  • అనంతరం పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కల అష్టబంధనాన్ని సమర్పిస్తారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top