రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు

TTD Issued show Cause Notice To Chief Priest Ramana Dikshitulu - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం టీటీడీ పాలక మండలి, అధికారులు, ఏపీ ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా రమణ దీక్షితులుకు అధికారులు నోటీసు జారీ చేశారు. అయితే టీటీడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రమణ దీక్షితులు ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో ఆయన లేరు. దీంతో నోటీసులను అధికారులు ఇంటికి అంటించారు. 

కాగా, మంగళవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన రమణ దీక్షితులు.. టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనాదిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమంటూనే ఎన్నో అవమానాలను భరించాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. టీటీడీలోని అధికారులు కొంతమంది అధికార బలంతో ఆలయ నిబంధనలను విస్మరిస్తున్నారని, సినీ, రాజకీయ ప్రముఖులకు భజన చేస్తూ ఆలయ సంప్రదాయాలను, కైంకర్యాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రమణ దీక్షితులు చేసిన విమర్శలు, ఆరోపణలు టీటీడీ అధికారులు, వేదపండిత, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి.

ఇది జరిగిన అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల వయోపరిమితిపై ధర్మకర్తల మండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని నిర్ణయించింది. దీంతో రమణ దీక్షితులు సహా నలుగురు ప్రధాన అర్చకులు తమ పదవులను కోల్పోయారు. రమణదీక్షతుల వ్యవహారంతో శరవేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీటీడీ నూతనంగా నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top