శ్రీవారి ఆలయంలో నూతన ప్రధాన అర్చకులు 

TTD appoints new Chief priests in tirumala - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నూతన ప్రధాన అర్చకులు నియమితులయ్యారు. నలుగురు అర్చకులను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. అనూహ్య పరిణామాల మధ్య గొల్లపల్లి వంశం నుంచి రమణ దీక్షితులకు బదులుగా వేణుగోపాల దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులు, పైడిపల్లి కుటుంబం నుంచి కృష్ణ శేషాచల దీక్షితులను నియమించారు.

ఎన్నో ఏళ్ల తర్వాత టీటీడీ సరికొత్త శకానికి శ్రీకారం చుట్టింది. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుల పాత్ర ప్రత్యేకమైంది. స్వామివారి కైంకర్యాల్లో అత్యంత కీలకమైన బాధ్యతలు ప్రధాన అర్చకులు నిర్వహిస్తారు. రమణదీక్షతుల వ్యవహారంతో శరవేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీటీడీ నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది. వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయంలో, శ్రీనివాస దీక్షితులు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తారు.

రిటైర్మెంట్ ప్రకటన శుభపరిణామం

40 తరాలుగా మిరాశిగా స్వామి వారికి సేవలు చేస్తున్నాను. 1997 వరకు మిరాసిగా వ్యవహరిస్తూ వస్తున్నాం. 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటన శుభపరిణామం. తర్వాతి తరాల వారికి కూడా అవకాశం కలిగించే భాగ్యం కలుగుతుంది. 65 సంవత్సరాలు పైబడిన వారికి హోదా మాత్రమే తగ్గుతుందే తప్ప మిగతా మర్యాదలతో పాటు స్వామి వారికి సేవలు చేసే భాగ్యం అలాగే ఉంటుంది. మిరాశిగా ఉన్నప్పుడు 8 ఏళ్లకు ఓసారి మారుతూ వచ్చేది. స్వామి వారి అభారణలపై విమర్శలు సరికాదు. టీటీడీ దగ్గర అని రికార్డ్స్ ఉన్నాయి. మహంతుల దగ్గర నుంచి తీసుకున్న అన్ని లెక్కలు ఉన్నాయి.
వేణుగోపాల్ దీక్షితులు

చాలా సంతోషంగా ఉంది 

ప్రధాన అర్చకుల హోదాలో మా నాన్నకు రిటైర్మెంట్‌ ఇచ్చి నాకు పోస్టింగ్ ఇచ్చారని పైడిపల్లి వంశానికి చెందిన శేషాచలం దీక్షితులు తెలిపారు. స్వామి వారికి సేవ చేసే భాగ్యం నాకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. నాన్నగారి పర్యవేక్షణలోనే స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తాను. మరో వైపు తిరుపతమ్మ వంశానికి చెందిన గోవిందరాజ దీక్షితులు మాట్లాడుతూ.. దేవస్థానం చైర్మన్, ఈఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. 

అన్నీ సవ్యంగా ఉన్నాయి

1958 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు స్వామి వారికి సేవలు చేస్తూ వస్తున్నాను. ఆగమశాస్త్రం ప్రకారమే స్వామి వారికి కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని సేవలు పద్దతి ప్రకారమే నిర్వహిస్తున్నారు. స్వామివారికి జరిపే పూజ కార్యక్రమాలలో ఎలాంటి దోషం లేదు. నైవేద్యం కూడా స్వామి వారికి సవ్యంగా జరుగుతుంది. షడ్కరా ఆరాధనలు స్వామి వారికి జరుగుతూనే ఉన్నాయి. పోటును మరమ్మత్తులు చేస్తున్నారే తప్ప లోపల కట్టడాలు ఏమీ కూల్చలేదు.
సుధార వరధారాజన్, ఆగమశాస్త్ర సలహా దారులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top