టీటీడీ అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి

The Age Limit to TTD Priests is 65 Years - Sakshi

ధర్మకర్తల మండలి నిర్ణయం

డిపాజిట్ల పర్యవేక్షణకు ప్రత్యేక సబ్‌ కమిటీ

చైర్మన్‌ పుట్టా  సుధాకర్‌ యాదవ్‌ వెల్లడి

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల వయోపరిమితిపై ధర్మకర్తల మండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని నిర్ణయించింది. ఎండోమెంట్‌ యాక్టు ప్రకారం అర్హత గల మిరాశీ, నాన్‌ మిరాశీ కుటుంబాలకు చెందిన వేద పండితులను ఖాళీ పోస్టుల్లో అర్చకులుగా నియమి స్తామని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు.

బుధవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్‌లో మండలి తొలి సమావేశం జరిగింది. మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌లు వివరాలను వెల్లడించారు. ఎజెండాలో పొందుపరిచిన 200 అంశాలపై సభ్యుల ఆమోదం తీసుకోవాల్సి ఉండగా కేవ లం 2 అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్‌ తెలిపా  రు. టీటీడీలో ఉన్న శ్రీవారి కానుకలను బ్యాంకుల్లో డిపాజిట్లు వేసే వ్యవహారంపై మంచీచెడులను విశ్లే షించి తగిన సూచనలు ఇచ్చేందుకు త్వరలో ప్రత్యేక సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు.

రమణ దీక్షితులుకు నోటీసు
మంగళవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీ పాలక మండలి, అధికారులు, ఏపీ ప్రభుత్వంపై  ఆరోపణలు చేసిన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు నోటీసు జారీ చేస్తున్నామని ఈవో అనిల్‌ కుమార్‌సింఘాల్‌ వెల్లడించారు. దీక్షితులు మీడియా ముందు ప్రస్తా వించిన అంశాలపై వివరణ కోరుతున్నామన్నారు.

65 ఏళ్లు పైబడి 16 మంది..
తిరుమలలో మిరాశీ కుటుంబాలకు చెందిన వంశపారంపర్య అర్చకత్వ సేవల్లో 52 మంది ఉన్నారు. ఇందులో 65 ఏళ్ల పైబడిన వారు 16 మంది ఉన్నారు. మార్గదర్శకాలు అమల్లోకి వస్తే వీరి తొల గింపు అనివార్యమవుతుంది. ఆలయ ప్రధానార్చక కుటుంబాలకు చెందిన రమణ దీక్షి తులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస, నారాయణ దీక్షితులు సైతం ఉద్యోగ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది.

చట్టబద్ధంగా ఎదుర్కొంటాం: రమణ దీక్షితులు
అరవై ఐదేళ్లు దాటిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. వంశ పారంపర్య అర్చకత్వంలో వేలు పెట్టే అధికారం టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న తప్పులను మీడియా ముందు ఎత్తిచూపినందుకే ప్రతీకార చర్యగా టీటీడీ అర్చకుల వయోపరిమితిపై నిర్ణయం తీసుకుందని దీక్షితులు ఆరోపించారు. టీటీడీ అధికారులు అజ్ఞానంతో తీసుకునే నిర్ణయాలపై మాట్లాడాల్సి రావడం బాధగా ఉందంటూ.. అర్చకులకు న్యాయస్థానం కల్పించిన హక్కులను వివరించారు.

1996లో మిరాశీలను రద్దు చేసినప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన విషయాలను ఉటంకించారు. బహు మానాలు, మర్యాదల్లో టీటీడీ వంశపారంపర్య అర్చకులకు ఆటంకం కలిగించ కూడదన్నారు. సంభావన ఏర్పాటుపై కూడా కోర్టు స్పష్టంగా ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు టీటీడీ అర్చకులను ఉద్యోగులుగా చూపుతూ ఉద్యోగ విరమణ వర్తింపజేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. స్వామివారి కైంకర్యాలకు వెళ్లిన అర్చకులను దుర్భాషలాడుతూ, సిబ్బంది చేత అవమానకరంగా మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top