పీఠాధిపతులతో మాట్లాడి నిర్ణయం : వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లా అభివృద్ధికి తన సర్వశక్తులు ఒడ్డుతానని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే మొదట వెలిగొండ ప్రాజెక్టు గురించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించానని పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఒంగోలు టీటీడీ కల్యాణ మండపం అభివృద్ధికి కృషి చేస్తామని.. అదేవిధంగా రెండు వారల్లో పాలకమండలి ఏర్పాటు చేస్తామని తెలిపారు. దర్శనాల విషయంలో సంస్కరణలు చేపడతామని వెల్లడించారు. శ్రీవారి సేవ చేస్తూనే ఒంగోలు అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.
నా ఆలోచనంతా ఇక్కడే..
తన హృదయం, ఆలోచన మొత్తం ప్రకాశం జిల్లా అభివృద్ధిపైనే ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని.. ఇందులో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. తద్వారా తాగు, సాగు నీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే సీఎం జగన్ లక్ష్యమని పునరుద్ఘాటించారు. టీటీడీ సహా వివిధ రంగాల్లో గత టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని నిగ్గు తేలుస్తామని పేర్కొన్నారు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శన విషయంలో పీఠాధిపతులు, పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మనం వదిలినా దేవుడు మాత్రం అక్రమార్కులను వదలడని వ్యాఖ్యానించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి