ఆగమోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

TTD brahmotsavam arrangements with Rs 9 crores - Sakshi

     రూ.9 కోట్లతో ఉత్సవ ఏర్పాట్లు

     బ్రేక్‌ దర్శనాలు, సేవలు రద్దు 

     రూ.26 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణం

     900 సీసీ కెమెరాలతో నిఘా 

     ‘సాక్షి’ ఇంటర్వ్యూలో టీటీడీ ఈవో

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలపై ఏర్పాట్లపై ఆయన సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. 

‘భక్తులకు పెద్దపీట
శ్రీవారి దర్శనానికి భక్తులకే పెద్దపీట వేస్తాం. నలుమాడ వీధుల్లో 2 లక్షల 26 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాం. వారికి 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల వాటర్‌ ప్యాకెట్లను సిద్ధం చేశాం. ఒక్కో సెక్టార్‌కు ఒక అధికారకిని నియమించాం. తిరుమలలో ఇప్పటికే 900 సీసీ కెమెరాల నిఘా ఉంది. ఆలయ నలుమాడ వీధుల్లో 280 అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. వీటిని 24 గంటలు పర్యవేక్షించేందుకు టీవీవాల్, సిబ్బందిని ఏర్పాటు చేశాం. విజిలెన్స్‌ సిబ్బంది 3 వేల మంది, పోలీసులు 2,500 మంది బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహిస్తారు. గరుడ సేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు. హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబర్లు 18004254141, 1800425333333కు భక్తులు ఫిర్యాదు చేయవచ్చు. 

బ్రేక్‌ దర్శనాలు, సేవలు రద్దు
బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. రూ.98 కోట్ల వ్యయంతో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా నిర్మించిన నూతన భవనాలను బ్రహ్మోత్సవాల్లో ప్రారంభిస్తాం. భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాం. వాహనసేవలను తిలకిం చేందుకు మాడ వీధుల్లో 19, భక్తుల రద్దీ ఉన్న ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 31 డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ చేస్తాం. తిరుమలలోని ప్రధాన కూడళ్లలో 11 ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారు. 3 వేల మంది శ్రీవారి సేవకులు, దాదాపు 1000 స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు.’ అని ఈవో వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top