పదేళ్ల తర్వాత నెరవేరుతున్న కల

Trust Board Establishing On Shingarakonda Anjaneya Swamy Temple - Sakshi

సాక్షి, అద్దంకి(ప్రకాశం) : జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి పదేళ్ల తర్వాత పాలక మండలి ఏర్పాటు కోసం దేవాదాయ శాఖ గత నెల 30న జీవో నంబర్‌ 986ను జారీ చేసింది. వార్షికాదాయం రూ.3 కోట్ల ఆదాయం ఉండి..అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి దేవస్థానమైన శింగరకొండకు జనవరి నాటికి తొమ్మిది మందితో కూడిన పాలక మండలి కొలువుదీరనుంది.

పాలకమండలి ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం మంగళం
శింగరకొండ దేవస్థానానికి ప్రతి రెండేళ్లకు ఒకసారి పాలక మండలిని ఏర్పాటు చేస్తారు. 2008 ఆగస్టు వరకు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన చిన్ని శ్రీమన్నారాయణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయింది. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన కొనసాగుతూ గొట్టిపాటి రవికుమార్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలక మండలి నియామకం చేపట్టలేక పోయారు. ఆ తర్వాత టీడీపీ పాలనలో వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యే రవికుమార్, అప్పటికే టీడీపీలో కొనసాగుతున్న కరణం బలరాంల మధ్య ఆధిపత్య పోరులో పాలక మండలి ఏర్పాటు కాలేదు. తాము చెప్పిన వారినే కమిటీలోకి తీసుకోవాలంటూ ఇద్దరు నేతలు పట్టుబట్టడంతో పాలక మండలిని నియమించలేకపోయారు. ఫలితంగా పదేళ్ల నుంచి దేవస్థానానికి పాలక మండలి లేకుండానే అధికారుల పాలనలో నడుస్తోంది.

గత నెల 30న పాలక మండలి ఏర్పాటుకు జీవో
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గత నెల 30న దేవదాయ శాఖ జీవో నంబర్‌ 986 ద్వారా పాలక మండలి నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవో ప్రకారం 9 మంది సభ్యులతో కూడిన పాలక మండలి ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19న ఆఖరు తేదీగా ప్రకటించారు.

మహిళలకు ప్రాధాన్యం
దేవస్థానం కమిటీ సభ్యుల్లో 50 శాతం మంది మహిళలు ఉండాలి. మిగిలిన 50 శాతం మంది ఎస్సీ, ఎస్సీ, బీసీ (హిందువులై ఉండాలి) వర్గాలకు చెందిన వారికి కేటాయించనున్నారు. అర్హులైన వారు ఈ నెల 19వ తేదీ సాయంత్ర లోపు దేవస్థానం కార్యాలయంలో ఏసీ తిమ్మనాయుడుకి దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. సభ్యులుగా దరఖాస్తు చేసే వారు కుల «ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు జత చేయాలి. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత పరిశీలనతో జనవరి నాటికి నూతన పాలక మండలి ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆశావహులు మాత్రం తమను కమిటీ సభ్యులుగా నియమించాలంటూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top