ఆ ఊరిలో ఏకంగా 45 హనుమాన్‌ దేవాలయాలు! | Over 40 Hanuman Temples In Telangana Village | Sakshi
Sakshi News home page

Vellulla: ఊరంతా హనుమాన్‌ దేవాలయాలే.. ఎందుకీ ప్రత్యేకత?

Published Tue, Apr 15 2025 6:25 PM | Last Updated on Tue, Apr 15 2025 7:58 PM

Vellulla 45 hanuman temples in this Telangana village full details

మొత్తం 45 గుళ్లు.. 10 విగ్రహాలు

వంశానికో వాయుపుత్రుడు

ఊరిలో ఒకటి.. రెండు హనుమాన్‌ దేవాలయాలు ఉండటం మామూలే. ఒకటి రెండు కాదు.. ఏకంగా 45 హనుమాన్‌ దేవాలయాలు.. అక్కడితో ఆగకుండా వీధుల్లో అక్కడక్కడ గుడి నిర్మాణాలు జరగని అంజన్న విగ్రహాలు పది వరకు కొలువుదీరి ఉన్నాయి. ఈ వింత జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో మనకు కనిపిస్తుంది. గ్రామంలో ఏ మూలకు వెళ్లిన ఓ అంజన్న దేవాలయం దర్శనమిస్తుంది. అక్కడ నిత్యపూజలు, భక్తజన కోలాహలం ఉంటుంది. ఎందుకిలా ఇంత పెద్ద మొత్తంలో అంజన్న దేవాలయాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఓ సారి ఆ ఊరి చరిత్రలోకి తొంగిచూడాల్సిందే. 

ఎటూ చూసినా అంజన్న గుళ్లు..
వెల్లుల్ల గ్రామ చావడి వద్ద పెద్ద మర్రిచెట్టును ఆనుకుని మూడు దిక్కులా ఎటు చూసినా అంజన్న దేవాలయాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల్లోకి వెళ్తే.. సందుకు ఓ అంజన్న గుడి కనిపిస్తుంది. ఈ గుళ్లు చిన్నవి.. పెద్దవి కావచ్చు. కానీ ఆయా గుళ్లలో హనుమంతునికి నిత్యపూజలు జరుగుతూనే ఉంటాయి. ఇలా వీధుల్లో ఉన్న అంజన్న దేవాలయాలు లెక్కిస్తే ఏతావాతా 45 వరకు ఉన్నాయి. దేవాలయాలే కాకుండా చెరువు కట్ట వద్ద రెండు హనుమాన్‌ విగ్రహాలు, గ్రామంలోని నాలుగైదు వీధుల్లో హనుమాన్‌ విగ్రహాలున్నాయి. వీటికి గుళ్ల నిర్మాణం జరగకున్నా భక్తులు ప్రతీ శనివారం పూజలు చేయడం ఆనవాయితీ.

ఈ సారి కొండగట్టు హనుమాన్‌ (Kondagattu Hanuman) జయంతి సందర్భంగా దాదాపు అన్ని హనుమాన్‌ దేవాలయాలను కాషాయరంగుల్లో అందంగా తీర్చిదిద్దారు. ప్రతీ దేవాలయంలో అంజన్న దీక్షాపరులు దీక్షల కోసం ప్రత్యేక నిలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఊరి జనాభా సుమారు 2,200 వరకు ఉండగా ఈ సారి హనుమాన్‌ దీక్షలు తీసుకున్న యువ భక్తుల సంఖ్య ఎంత తక్కువ అనుకున్నా 300 దాకా ఉంటుందని గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ చెప్పడం గమనార్హం. ఇక్కడ ఉన్న అంజన్న గుళ్లకు అభయాంజనేయ, భక్తాంజనేయ, వీరాంజనేయ.. ఇలా వెల్లుల్లలో అంజన్న గుడులు ఉన్న కారణంగా అంజన్న దీక్షా సమయంలో 41 రోజుల పాటు వెల్లుల్ల గ్రామం కాషాయ రంగు పులుముకుని హనుమాన్‌ భక్తుల సందడి, అంజన్న భజనలతో సందడిగా ఉంటుంది.  

ఎందుకీ ప్రత్యేకత?
జైన చాళుక్యుల పాలనా కాలంలో వెల్లుల్ల గ్రామం (Vellulla Village)లో సుమారు 200 వరకు బ్రాహ్మణ కుటుంబాలు నివాసముండేవి. ఈ బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా మంది అంజన్నను ఆరాధ్య దైవంగా భావించేవారు. వీరు తమ ఆరాధ్య దైవానికి నిత్యపూజలు అందించేందుకు వంశాల వారీగా ఎవరికి వారు తమ ఇళ్ల పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో వీలైన రీతిలో పెద్ద, చిన్న ఆంజనేయ గుళ్లు నిర్మించుకున్నారు. గ్రామంలోని గుట్ట గండి సమీపంలో మర్రిచెట్టు వద్ద ఉన్న ఆంజనేయ ఆలయం ఆ కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న దొంగల బారి నుంచి తమను అంజన్న కాపాడతాడనే నమ్మకంతోనే నిర్మించినట్లు గ్రామస్తులు చెబుతారు.

ఇలా వంశానికి ఒక్కటి చొప్పున అంజనేయ ఆలయాలు (Anjaneya Temples) నిర్మించడం గ్రామంలో ప్రతీ వీధిలో అంజన్న గుళ్లు కనిపించడానికి ప్రధాన కారణం. కాలక్రమేణా బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్లినప్పటికీ గ్రామస్తులు మాత్రం ఆ గుళ్లను తమ ఇంటి అంజన్నగా మార్చుకుని నిత్య పూజలు నిర్వహించడం ఆచారంగా మార్చుకున్నారు. దీనికి తోడు పురాతన కాలంలో నిర్మించిన అంజన్న దేవాలయాలతో పాటు కొత్తగా ఇంటి దగ్గర అంజన్న గుడి ఉంటే శుభప్రదమన్న నమ్మకంతో కొంత మంది తమ తమ ఇళ్ల వద్ద అంజన్న గుళ్లు నిర్మించడంతో పాత, కొత్త అంజన్న దేవాలయాలన్నీ కలిసి వెల్లుల్ల గ్రామాన్ని ‘అంజన్న ఆలయాల ఖిల్లా’గా మార్చాయి.  

బ్రాహ్మణులు ఏర్పాటు చేసినవే 
జైనుల కాలంలో వెల్లుల్ల గ్రామంలో సుమారు 200 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవని చెబుతారు. ఆ కుటుంబాలు ఎవరికి వారు అంజన్న గుడులు నిర్మించి నిత్యపూజలు చేసేవారని పెద్దలు చెప్తారు. బ్రాహ్మణులు ఇక్కడి నుంచి వెళ్లిపోయినా అవే గుళ్లు ఇప్పటికీ ప్రజలకు ఆరాధ్యదైవాలుగా మారి పూజలు అందుకుంటున్నాయి.  
– మార మురళి, వెల్లుల్ల

అంజన్న అంటే నమ్మకం 
మా ఊరిలో అన్ని కుటుంబాలకు ఆరాధ్యదైవం అంజన్న. అంజన్న గుళ్లు నిర్మించుకున్న అన్ని కుటుంబాల నుంచి ఏటా యువకులు అంజన్న దీక్షలు చేపడతారు. అంజన్న దీక్షా కాలంలో మా ఊరు కాషాయమయంగా మారుతుంది. అంజన్న భక్తులను భజనలతో ఊరు మార్మోగుతుంది.  
– మహేశ్, వెల్లుల్ల, అంజన్న భక్తుడు

ఆ కాలంలో నిర్మించినవే 
1920–30 దశాబ్దిలో వెల్లుల్ల గ్రామంలో ఉన్న 200 బ్రాహ్మణ కుటుంబాలు ఎవరి వంశానికి వారు నిర్మించుకున్న ఆంజన్న గుడులే ఇప్పుడు వెల్లుల్లలో మనకు కనిపిస్తున్నాయి. కాల క్రమేణా బ్రాహ్మణులు ఇక్కడి నుంచి వెళ్లిపోయినా అంజన్నపై నమ్మకంతో గ్రామస్తులు ఆ గుడులను మళ్లీ అభివృద్ధి చేసి పూజలు చేస్తున్నారు. అంతే కాక గ్రామంలో కొత్త ఆలయాలు నిర్మించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇదే వెల్లుల్లకు ప్రత్యేకతను ఇచ్చింది.    
– నంబి కిషన్‌ శర్మ, పూజారి వెల్లుల్ల  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement