
భక్తితో పూజిస్తే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి కఠినమైన నిష్ఠలు, నియమాలు, మడులకన్నా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తాలే ముఖ్యం. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాచరణ వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సకల సంపదలూ కలుగుతాయని ప్రతీతి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, ఆరోగ్య సంపద, జ్ఞానసంపద మొదలైనవి ఎన్నో.
పూజను చక్కగా... భక్తి శ్రద్ధలతో చేసుకోవాలంటే ముందుగా పూజాద్రవ్యాలను సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మధ్య మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు.
పూజకు కావలసినవి: పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరొత్తులు, కర్పూరం, చిల్లరనాణేలు, తెల్లని వస్త్రం, రవికల గుడ్డ, మామిడాకులు, పండ్లు, అమ్మవారి పటం లేదా ప్రతిమ, కలశం, కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో శుచిగా తయారు చేసిన నైవేద్యాలు (శక్తి కొలదీ చేసుకోవచ్చు) బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, ఆవునెయ్యి.
శ్రావణమాసంలో ΄పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.
వ్రత విధానం
వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన ముగ్గువేసి, కలశం పెట్టాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును అమర్చుకోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకుని ఉంచాలి.
తోరం ఇలా తయారు చేసుకోవాలి
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఇలా తయారు చేసుకున్న తోరాలను పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి పూజకు సిద్ధం కావాలి.
గణపతి పూజ
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా! ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలుంచాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి. స్వామివారి ముందు పళ్ళు లేదా బెల్లాన్ని నివేదించి తాంబూలం సమర్పించాలి. అనంతరం నీరాజనం సమర్పించాలి. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సు మీద ఉంచుకోవాలి. తర్వాత వరలక్ష్మీ వ్రతాన్నిప్రారంభించాలి.
కలశపూజ
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితాః
కుక్షౌతు సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై చిలకరించాలి. పూజ చేస్తున్న వారు తమపైన చల్లుకోవాలి.
అనంతరం పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి. ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఇంతకుముందు సిద్ధం చేసుకున్న తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి పూజించి కుడిచేతికి తోరం కట్టుకోవాలి.
వ్రత కథాప్రారంభం
పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ‘‘మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి’’ అన్నారు. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని చెబుతూ శివుడు పార్వతికి చెప్పిన ఆ వ్రత కథను ఇలా చెప్పసాగాడు.
పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గల యోగ్యురాలు. రోజూప్రాతఃకాలాన నిద్రలేచి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని భర్త, అత్తమామల సేవలో తరించేది.
వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో కనిపించి ‘ఓ చారుమతీ! ఈ శ్రావణ ΄పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తాను’ అంటూ పూజా విధానాన్ని చెప్పి అంతర్థానమైంది.
అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా ΄పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.
శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.
అనంతరం అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి రథ గజ తురగ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.
ఈ కథ విని అక్షతలు శిరసుపై ధరించాలి. ఆ తరువాత ముతై ్తదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాలి. పూజ చేస్తున్నంతసేపూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.
– డి.వి.ఆర్.