
బుల్లితెర బ్యూటీ సిరి హన్మంత్ బిగ్‌బాస్ షోతో పాపులర్ అయింది. ఉయ్యాలా జంపాలా సీరియల్‌తో నటనవైపు అడుగులు వేసిన సిరి.. సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి వంటి సీరియల్స్‌లో నటించి ఆకట్టుకుంది. సాఫ్ట్‌వేర్ బిచ్చగాళ్లు, మేడం సార్ మేడం అంతే, రామ్ లీలా, పులి మేక వంటి వెబ్ సిరీస్‌లతో ఫుల్ పాపులర్ అయింది. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
చీరలో అందంగా సిరి
ఆ మధ్య వచ్చిన షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రంలోనూ చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. తాజాగా ఈ బిగ్‌బాస్ బ్యూటీ ప్రియుడు, నటుడు శ్రీహాన్‌తో కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీహాన్ పంచెకట్టులో ఉండగా సిరి చీరలో అందంగా ముస్తాబైంది. ఇది చూసిన కొందరు పెళ్లి కాకుండా ఇలా జంటగా వరలక్ష్మి వ్రతం చేయొచ్చా? అని సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు.
అందుకే పెళ్లి ఆలస్యం?
కాగా సిరి, శ్రీహాన్ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చాలాకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సిరి-శ్రీహాన్ పెళ్లి గురించి ఎన్ని రూమర్లు వచ్చినా వీరు మాత్రం వాటిని పట్టించుకోనట్లే ఉంటున్నారు. దానికింకా టైముంది అన్నట్లుగానే ఓ ఎక్స్‌ప్రెషన్ పడేస్తున్నారు. అయితే ఓ సందర్భంలో సిరి మాట్లాడుతూ.. చిన్నప్పుడే తండ్రికి దూరం కావడంతో చాలా కష్టాలు చూశా. అందుకే, బాగా సెటిల్ అయి., మంచి స్థాయికి చేరుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
చదవండి: వాళ్లు ఒప్పుకోకపోయినా నేనింకా హీరోయిన్‌నే.. 60 ఏళ్ల సీనియర్ నటి