ఈ హీరోల టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది! | Interesting Comparison Of Naveen And Adivi Sesh Siddhu Jonnalagadda | Sakshi
Sakshi News home page

Tollywood: వీళ్లతో సినిమా చేసి.. ఇప్పుడెక్కడా కనిపించట్లేదేంటి?

Feb 3 2026 5:45 PM | Updated on Feb 3 2026 6:17 PM

Interesting Comparison Of Naveen And Adivi Sesh Siddhu Jonnalagadda

టాలీవుడ్‌లో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. కమర్షియల్ సినిమాలు ఒకటో రెండు ఆడుతున్నాయి తప్పితే కంటెంట్ బేస్డ్ చిత్రాలకే ఎక్కువగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోలు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అంటే రైటింగ్ లాంటి వాటిలో పాలుపంచుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ పేర్లు ప్రముఖమైనవి. వీళ్ల ప్రతిభని అందరూ మెచ్చుకుంటున్నారు. కాకపోతే నాణెనికి మరోవైపు చూస్తే పరిస్థితి చిత్రంగా ఉంటుంది.

(ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)

అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ.. వీళ్లు డైరెక్ట్‌గా హీరోలు అయిపోలేదు. చాన్నాళ్ల పాటు సైడ్ క్యారెక్టర్స్ చేశారు. గుర్తింపు రావడానికి చాలా టైమ్ పట్టింది. ఈ టైంలోనే కేవలం యాక్టింగ్‌ని నమ్ముకోకుండా రైటింగ్‌పై కూడా పట్టుసాధించారు. తమ సినిమాలకు కథలు, సీన్స్ విషయంలో వీళ్ల వైపు నుంచి అద్భుతమైన తోడ్పాటు అందించారు. ఇదే ఆయా చిత్రాల తీసే దర్శకులకు మైనస్ అవుతుందా అనే సందేహం కలుగుతోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి.

అడివి శేష్‌నే తీసుకుందాం. క్షణం, గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తోనే తీసిన ఈ మూవీస్.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. వీటి సక్సెస్‍‌లో శేష్ సహకారం చాలానే ఉంది. కానీ ఈ చిత్రాలు తీసిన దర్శకులు రవికాంత్ పేరేపు, శశికిరణ్ తిక్క.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. ఆయా చిత్రాల రిలీజ్‌కి ముందు, తర్వాత కూడా శేష్‌కే చాలా పేరొచ్చింది తప్పితే దర్శకులని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. శేష్ ప్రస్తుతం చేస్తున్న డకాయిట్, గూఢచారి 2 సినిమాలకు దర్శకులు ఎవరని అడిగితే చాలామంది చెప్పలేరు. అది పరిస్థితి.

(ఇదీ చదవండి: ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?)

నవీన్ పొలిశెట్టి విషయానికొస్తే.. స్వతహాగా తెలుగు కుర్రాడే కానీ మొదట హిందీలో పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, వన్ నేనొక్కడినే, డీ ఫర్ దోపిడి లాంటి చిత్రాల్లో యాక్టింగ్ చేశాడు. కాకపోతే వాటి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు! హీరోగా చేసిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ'.. నవీన్ కెరీర్‌ని మలుపు తిప్పింది. ఈ మూవీ దర్శకుడు ఎవరని అడిగితే.. చాలామంది చెప్పలేరు. అంతెందుకు రీసెంట్‌గా సంక్రాంతికి వచ్చిన 'అనగనగా ఒక రాజు' మూవీకి కూడా కర్త కర్మ క్రియ నవీనే.. దర్శకుడిగా మారి అనే కుర్రాడు ఉన్నప్పటికీ.. క్రెడిట్ అంతా నవీన్‌కే వచ్చింది.

సిద్ధు జొన్నలగడ్డ.. కెరీర్ ప్రారంభంలో 'ఆరెంజ్'తో పాటు పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసినప్పటికీ 'డీజే టిల్లు' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు దక్కింది. 'టిల్లు స్కేర్'తో ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ రెండు మూవీస్‌కి దర్శకులు ఎవరంటే? చాలామంది చెప్పలేరు. ఎందుకంటే ఈ చిత్రాల రైటింగ్ విషయంలో సిద్ధు కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాల తర్వాత సదరు దర్శకులు కొత్తగా ఏం మూవీస్ చేస్తున్నారో? ఎక్కడున్నారో తెలీదు? ఇలా పైన చెప్పిన హీరోలు తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నప్పటికీ.. వీళ్ల సినిమాలకు దర్శకులుగా చేస్తున్న వాళ్లు మాత్రం.. తర్వాత నుంచి పెద్దగా కనిపించకుండా పోతున్నారు.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?)

Advertisement
 
Advertisement
Advertisement