
475వ నామం వద్ద అమ్మవారిని ‘విశుద్ధి చక్ర నిలయా‘ అనగా విశుద్ధి చక్రంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన సూక్ష్మ శరీరంలో కంఠం వద్ద ఉంటుంది. కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటునప్పుడు మనిషికి సంఘ జీవనం అలవడి, సాక్షీభూత స్థితిలో దైవికమైన చాతుర్యంతో మాట్లాడగల వాక్ శక్తి లభిస్తుంది.
103వ నామం వద్ద అమ్మవారిని ‘ఆజ్ఞా చక్రాంత రాళస్థా‘అనగా ఆజ్ఞాచక్రం మధ్యలో ఉండునది అంటూ వర్ణిస్తారు. ఈ ఆజ్ఞాచక్రం మనం నుదురు మీద బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఉంటుంది, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటినప్పుడు మనిషి లోపల క్షమాగుణం నెలకొని పరిపూర్ణ నిర్విచార స్థితి అనగా ఆలోచనలు లేని స్థితిని పొందుతాడు. సాధారణం గా మనిషికి ఆలోచనలు లేకుండా ఉండడం నిద్రలో మాత్రమే సాధ్యమవుతుంది.
కానీ ఈ స్థితిని చేరుకున్న మనిషి మెలకువగా ఉన్నప్పుడు కూడా ఆలోచనలు లేని స్థితిని పొందగలుగుతాడు. 105వ నామం వద్ద ‘సహస్రారాంబుజారూఢా‘ అనగా సహస్ర దళ పద్మంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన తల మీద మాడు ప్రాంతం లేదా బ్రహ్మ రంధ్రం వద్ద ఉంటుందని, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని ఛేదించుకొని పైకి వచ్చినప్పుడు మనిషికి యోగం లభిస్తుందని వివరిస్తారు.
మానవ చేతన తన చుట్టూ ఉండే భగవంతుని పరమ చైతన్య శక్తితో అనుసంధానాన్ని పొందుతుందని, మానవ మెదడును లోపల నుండి గమనిస్తే, 1000 నరాలు కలిసి, 1000 దళాలు గల పద్మంలా కన్పిస్తుందని, అందుకే ‘సహస్రారం’ అని పిలుస్తారని చెబుతారు. 106వ నామం వద్ద ‘సుధాసారాభి వర్షిణి’ అనగా అమృతధారలు కురిపించునది అని వర్ణిస్తారు. కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని దాటిన తరువాత చైతన్య తరంగాల అనుభూతి మొదలవుతుంది. అమృత ధారల వంటి ఈ చైతన్య తరంగాలను అనుభూతి చెందడం కుండలినీ జాగృతి వల్లే సాధ్యమవుతుంది. ఆ సమయంలో సాధకులు బ్రహ్మానందానుభూతిలో లీనమవుతారు.
– డా. పి. రాకేష్
పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా