మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం | Pushpagiri Temple Kadapa Timings, History | Sakshi
Sakshi News home page

మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం

Sep 11 2025 10:37 AM | Updated on Sep 11 2025 10:46 AM

Pushpagiri Temple Kadapa Timings, History

పూర్వం తన తల్లి దాస్య విముక్తికోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకుపోతూండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండేచోటున పడిందట. దాని ఫలితంగా అప్పట్లో ఆ మడుగులో స్నానం చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగానూ, యవ్వనవంతులుగానూ మారిపోవడంతోపాటు అమరత్వం కూడా పొందేవారట. దాని మహిమను ప్రత్యక్షంగా చూసిన నారదుడు బ్రహ్మదేవుడికి నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు అనిపించింది. 

వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి,  ‘‘హనూ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి‘ అన్నాడు. చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూ వుంది.

ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలు΄ోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలో వుండే విష్ణుమూర్తి వద్దకు ΄పోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి విన్నవించారు. 

విష్ణుమూర్తి అంతా విని, ‘‘నాకూ, శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!‘ అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపివేశాడు. తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూ వున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు. అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకు΄ోయింది.

అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది– పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతాన్ని తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి ‘పుష్పగిరి’ అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై వెలుగొందుతోంది. 

ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.

కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు పక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ’మధ్య కైలాసం’ అనీ అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.  పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.

హరిహరాదుల క్షేత్రం
శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

జనమేజయుడు చేసిన సర్పయాగ పాపరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.

చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.

కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.

పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్రపాదం, విష్ణుపాదం ఈ కొండ మీదే ఉన్నాయి. 

వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవస్వామికి పూజలు జరుగుతాయి. పాతాళగణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.

(చదవండి: లాల్‌బాగ్చా నిమజ్జనంలో ఏం జరిగింది..? మండిపడుతున్న భక్తులు..)



  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement