breaking news
pushpagiri peetham
-
శ్రీనృసింహ భారతి దైవ సమాధి
వల్లూరు (వైఎస్సార్ జిల్లా) : శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించిన పుష్పగిరి పీఠం పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహ భారతి పార్థివ దేహాన్ని భక్తుల అశ్రు నయనాల మధ్య మంగళవారం దైవ సమాధి చేశారు. తీవ్ర గుండెపోటుతో ఆదివారం ఆయన హైదరాబాద్లో తనువు చాలించిన విషయం విదితమే. వైఎస్ఆర్ జిల్లాలోని పుష్పగిరి పీఠం సంప్రదాయాల మేరకు తొలుత చంద్రమౌళీశ్వరుని స్పటిక లింగానికి రుద్రాభిషేకం నిర్వహించాక అంతిమ సంస్కార కార్యక్రమాలను ప్రారంభించారు. జగ్గయ్యపేటకు చెందిన శ్రీ గంభీరానందస్వామి పర్యవేక్షణలో స్వామీజీ శిష్యులు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠం పీఠాధిపతి కమలానంద భారతి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నూతన పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి చేతుల మీదుగా దైవ సమాధి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి పార్థివ దేహానికి అభిషేకం నిర్వహించిన అనంతరం దివంగత పీఠాధిపతుల సమాధుల సరసన గర్తం పూజ నిర్వహించారు. స్వామివారి పార్థివ దేహాన్ని భక్త జన సందోహం మధ్య ఊరేగింపుగా సమాధి స్థలం వద్దకు తీసుకు వచ్చారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి సమాధి ప్రవేశం పూర్తి చేశారు. నివాళులర్పించిన ప్రముఖులు స్వామి వారి పార్థివ దేహం వద్ద మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆయన శిష్యులు, భక్తులు పుష్పగిరికి చేరుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, కమలాపురం శాసన సభ్యుడు పీ.రవీంధ్రనాథరెడ్డి, జిల్లా కలెక్టర్ కేవీ రమణ, జాయింట్ కలెక్టర్ -2 కృష్ణ భారతి, కడప ఆర్డీవో చిన్న రాముడు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర బాలాజీ, తదితరులు స్వామి వారికి నివాళులర్పించారు. -
విద్యానృసింహ స్వామికి వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్: పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యానృసింహ భారతీస్వామి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం శ్రద్ధాంజలి ఘటించారు. బేగంపేటలో పుష్పగిరి భారతి వేద పాఠశాలలో ఉంచిన భారతీస్వామి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గుండెపోటుతో ఆదివారం మధ్యాహ్నం 3.45కి బషీర్బాగ్ అపోలో ఆస్పత్రిలో భారతీస్వామి తుది శ్వాస విడిచారు. కడప జిల్లా పుష్పగిరిలోని కేంద్ర స్థానంలోమంగళవారం శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు జరుగుతాయని స్వామి వ్యక్తిగత కార్యదర్శి ఎన్.భారతీస్వామి తెలిపారు. కడపజిల్లా చెన్నూరులో 1940లో జన్మించిన భారతీస్వామి 1957లో పుష్పగిరి పీఠం బాధ్యతలు చేపట్టారు. దక్షిణ భారత దేశంలోనే సుదీర్ఘంగా 60 ఏళ్ల పాటు కొనసాగిన ఏకైక పీఠాధిపతిగా ఘనతకెక్కారు. పీఠాధిపతిగా అరవయ్యో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ‘షష్ట్యబ్ది ఉత్సవం’ చేయాలని పూనుకున్న తరుణంలో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు.