శ్రీనృసింహ భారతి దైవ సమాధి | Sakshi
Sakshi News home page

శ్రీనృసింహ భారతి దైవ సమాధి

Published Tue, Sep 29 2015 7:53 PM

Sri vidya nrisimha bharati laid to rest

వల్లూరు (వైఎస్సార్ జిల్లా) : శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించిన పుష్పగిరి పీఠం పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహ భారతి పార్థివ దేహాన్ని భక్తుల అశ్రు నయనాల మధ్య మంగళవారం దైవ సమాధి చేశారు. తీవ్ర గుండెపోటుతో ఆదివారం ఆయన హైదరాబాద్‌లో తనువు చాలించిన విషయం విదితమే. వైఎస్‌ఆర్ జిల్లాలోని పుష్పగిరి పీఠం సంప్రదాయాల మేరకు తొలుత చంద్రమౌళీశ్వరుని స్పటిక లింగానికి రుద్రాభిషేకం నిర్వహించాక అంతిమ సంస్కార కార్యక్రమాలను ప్రారంభించారు.

జగ్గయ్యపేటకు చెందిన శ్రీ గంభీరానందస్వామి పర్యవేక్షణలో స్వామీజీ శిష్యులు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠం పీఠాధిపతి కమలానంద భారతి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నూతన పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి చేతుల మీదుగా దైవ సమాధి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి పార్థివ దేహానికి అభిషేకం నిర్వహించిన అనంతరం దివంగత పీఠాధిపతుల సమాధుల సరసన గర్తం పూజ నిర్వహించారు. స్వామివారి పార్థివ దేహాన్ని భక్త జన సందోహం మధ్య ఊరేగింపుగా సమాధి స్థలం వద్దకు తీసుకు వచ్చారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి సమాధి ప్రవేశం పూర్తి చేశారు.

నివాళులర్పించిన ప్రముఖులు
స్వామి వారి పార్థివ దేహం వద్ద మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆయన శిష్యులు, భక్తులు పుష్పగిరికి చేరుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం శాసన సభ్యుడు పీ.రవీంధ్రనాథరెడ్డి, జిల్లా కలెక్టర్ కేవీ రమణ, జాయింట్ కలెక్టర్ -2 కృష్ణ భారతి, కడప ఆర్డీవో చిన్న రాముడు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర బాలాజీ, తదితరులు స్వామి వారికి నివాళులర్పించారు.

Advertisement
Advertisement