65 అడుగుల ఎత్తులో అద్భుతమైన కట్టడం | Jadcherla Gollatha temple history and interesting facts | Sakshi
Sakshi News home page

గతమెంతో ఘనం.. నాటి చరిత్రకు దర్పణంగా గొల్లత్త గుడి

Aug 28 2025 7:29 PM | Updated on Aug 28 2025 7:33 PM

Jadcherla Gollatha temple history and interesting facts

జైనులకు ప్రధాన కేంద్రంగా వర్ధిల్లిన ఆలయం

ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలం

జడ్చర్ల: ఎంతో విశిష్టత గల ఆ ప్రాచీన ఆలయ చరిత్రను తెలుసుకుంటే గర్వంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని శిథిలాలను చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఇటుక మీద ఇటుకను పేర్చి నిర్మించిన ఆ అద్భుతమైన కట్టడం.. ఇప్పుడు గత వైభవానికి సాక్ష్యంగా నిలిచింది. తల తెగిన శిల్పాలు, గుప్త నిధుల వేటలో మిగిలిన శిథిలాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన గొల్లత్త గుడిపై కథనమిది.

రాష్ట్ర కూటుల కాలం నాటి నిర్మాణం 
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్‌–ఆల్వాన్‌పల్లి గ్రామాల మధ్య 167 నంబర్‌ జాతీయ రహదారిని ఆనుకుని.. దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో గొల్లత్త గుడి ఆలయాన్ని నిర్మించారు. దీన్ని 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులు నిర్మించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 65 అడుగుల ఎత్తులో.. నాలుగు అడుగుల మందంతో.. కేవలం ఇటుకపై ఇటుకను పేర్చి నిర్మించారు. మధ్యలో ఎలాంటి బంకమట్టి లేకుండా అంత ఎత్తు వరకు.. అత్యంత కళాత్మకంగా గుడి నిర్మాణం చేపట్టారు. ఈ తరహాలో నిర్మించిన గుడి దక్షిణ భారతంలోనే ఒకటి.. ఇలాంటిదే మరొకటి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ భీతర్‌గావ్‌ శివారులో ఉంది.

జైనుల ఆలయంగా ప్రసిద్ధి.. 
ఒకప్పుడు ఈ ప్రాంతంలో జైన మతం బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఎంతో మంది జైన తీర్థంకరులు నడయాడిన నేలగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. జైనీయుల స్థిర నివాసంగా, ధాన్య భాండాగారంగా గొల్లత్త గుడి పేరు గాంచింది. ఈ గుడిలో బంగారు కుండలు (Gold Pots) ఉండేవన్న ప్రచారం ఉంది. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి కాలి నడకన తరలివచ్చే జైన గురువులు.. దీన్ని సందర్శించేవారని అప్పటి శాసనాల ద్వారా గుర్తించారు. ఆలయం లోపల వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడి విగ్రహాలు ఉండేవి. భద్రత దృష్ట్యా ఇక్కడి నుంచి ఒకటి హైదరాబాద్‌లోని గోల్కొండకు, మరొకటి పాలమూరు పిల్లలమర్రిలోని మ్యూజియాలకు తరలించారు.

శిథిలావస్థలో గుడి.. 
గొల్లత్త గుడి కాలక్రమేనా శిథిలావస్థకు చేరుకుంది. గుడి పైకప్పు కూలిపోయింది. వర్షాల కారణంగా చుట్టూ ఉన్న కొన్ని ఇటుకలు పట్టు తప్పిపోగా, కరిగిపోయాయి. దీంతో గుడి పటిష్టానికి పురావస్తుశాఖ అధికారులు.. కింద నుంచి దాదాపు 7 అడుగుల వరకు తాత్కాలికంగా సిమెంట్‌ పనులు చేయించారు. ఊడిన ఇటుకల స్థానంలో కొత్తగా చేర్చిన ఇటుకలు కరిగిపోగా.. శతాబ్దాల కిందటి ఇటుకలు చెక్కుచెదరక పోవడం గమనార్హం. ప్రస్తుత గుడి మాదిరిగానే.. చుట్టూ మరో ఐదు గుళ్లు ఉండగా.. కాలక్రమేణా కనుమరుగయ్యాయి.  

గుడి వెనుక దిబ్బలు 
గొల్లత్త గుడి (Gollatha temple) వెనుక భాగంలో రెండు ప్రధాన దిబ్బలు ఉన్నాయి. వీటిలో ఒక దిబ్బ కనుమరుగవగా.. ఈ దిబ్బ చుట్టూ పండుగల సందర్భంగా ఎడ్ల బళ్లతో వచ్చి జనం తిరిగేవారని చెబుతుంటారు. మరో దిబ్బ ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ దిబ్బలో అప్పటి నిర్మాణాల ఆనవాళ్లు కనిపిస్తాయి. పాదాల గుట్టలో శిథిలావస్థలో ఎన్నో విగ్రహాలు కనిపిస్తాయి. ధ్వంసమైన నంది విగ్రహాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో మహిళల పాదముద్రలు చెక్కిన రాతి గుర్తులు ఉన్నాయి. గజ్జెలు, గొలుసులు, నాలుగు వేళ్లకు మెట్టెలతో చెక్కి ఉన్నాయి. అత్యంత సుందరంగా చెక్కిన ఈ పాదాలు అప్పటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా పేర్కొనవచ్చు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు 
ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం కొందరు విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. వారి చేతుల్లో ఆలయ ప్రాంగణం చాలా వరకు ధ్వంసమైంది. గుడి పైకప్పులో సైతం తవ్వకాలు జరపడంతో కూలిపోయింది. గుడి దక్షిణ భాగంలో సైతం తవ్వకాలు జరిపారు. ప్రస్తుతం గుడి చుట్టూ ముళ్ల పొదలు, కంపచెట్లు ఏపుగా పెరగడంతో.. గుడి ఉనికికి ప్రమాదం ఏర్పడింది.

పేరు వెనుక కథ 
ఈ గుళ్ల నిర్మాణం వెనుక స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది. పాలు, పెరుగు అమ్ముకునే ఈ ప్రాంతానికి చెందిన ఓ గొల్ల పడుచు.. తన ఆస్తినంతా వెచ్చించి ఈ గుళ్లని నిర్మించిందని.. అందుకే ఈ గుళ్లకు గొల్లత్త గుళ్లు అనే పేరు వచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది.

చ‌ద‌వండి: మ‌ధ్య‌యుగ వైద్య చ‌రిత్ర‌లో మేటి.. అగ్గ‌ల‌య్య‌

రూ.2 కోట్లతో ప్రతిపాదనలు 
గొల్లత్త గుడిని పరిరక్షించేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విశాలాక్షి హయాంలో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి నివేదించారు. ఇప్పటికే కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రూ.54 లక్షల వ్యయంతో గుడి స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు.

అమలుకాని ప్రతిపాదనలు 
గొల్లత్త గుడి అభివృద్ధికి కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ హయాంలో పురావస్తుశాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తదుపరి ఎలాంటి చొరవ లేకపోవడంతో ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గొల్లత్త గుడి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. 
– రాములు, మాజీ మండల ఉపాధ్యక్షుడు, గంగాపూర్‌

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి 
గొల్లత్త గుడిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గుడిని కాపాడాలి. ఇప్పటికే గుప్త నిధుల కోసం వేటగాళ్లు ఈ ప్రాంతమంతా తవ్వేశారు. నాటి చరిత్రకు సంబంధించిన విగ్రహాలు, తదితర కట్టడాలు ధ్వంసమయ్యాయి. 
– శ్రీనివాసులు, గంగాపూర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement